వెండి ధర రూ.3 లక్షల వరకు చేరనుందా?

Silver Price : గత కొద్ది రోజులుగా వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా వెండిని కొనుగోలు చేస్తుండటంతో, దీని ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలలో ఒకటి రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధాలు. వీటితో పాటు ట్రంప్ టారిఫ్‌ల (వ్యాపార పన్నులు) కారణంగా స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు వెండిలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు.

ఒక్కరోజులో రూ. 2,700 పెరిగిన వెండి ధరలు

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం.. మంగళవారం రాత్రి వెండి ధర దాదాపు రూ. 2,700 పెరిగింది. దీంతో ఒక కిలో వెండి ధర రూ. 1,00,460 కి చేరుకుంది. అయితే, బుధవారం ఉదయం MCX (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్),హాజర్‌ మార్కెట్‌లో స్వల్ప తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, వెండి ధరల పెరుగుదల ట్రెండ్ కొనసాగుతోంది.

వెండి ధరలో 6 శాతం పెరుగుదల

ఏంజిల్ వన్ కరెన్సీ విశ్లేషకుడు ప్రథమేష్ మాల్యా ప్రకారం.. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి లోహాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. గత 3-4 సెషన్లలో అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర దాదాపు 6 శాతం పెరిగిందని ఆయన తెలిపారు.

దీంతో పాటు MCX ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధరలు దాదాపు 5 శాతం పెరిగాయని ప్రథమేష్ మాల్యా పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత పెరుగుతాయని, త్వరలో MCX ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధర కిలోకు రూ.1,06,000 కు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. అయితే, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని భవిష్యత్తులో వెండి ధరలు తగ్గే అవకాశం కూడా ఉందని ఆయన హెచ్చరించారు.

వెండి ధర రూ. 3 లక్షల మార్కును దాటుతుందా?

వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఒక కిలో వెండి ధర ఎక్కడి వరకు వెళ్తుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల ప్రసిద్ధ వ్యక్తిగత ఆర్థిక పుస్తకం ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ ద్వారా 2025లో వెండి ధరలు 3 రెట్లు పెరుగుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం వెండి ధర 60 శాతం తక్కువగా ఉందని, అయితే బంగారం, బిట్‌కాయిన్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కియోసాకి అంచనా ప్రకారం.. వెండి ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story