Silver Prices : బంగారం అరాచకం..వెండి విశ్వరూపం..తులం ధర వింటే కళ్ళు తిరగాల్సిందే
తులం ధర వింటే కళ్ళు తిరగాల్సిందే

Silver Prices : కొత్త ఏడాది 2026 ప్రారంభమైందో లేదో.. బంగారం, వెండి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఒక్క రోజే వెండి ఏకంగా వేల రూపాయల మేర పెరగడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, డాలర్ ఇండెక్స్ పతనం మన దేశీ మార్కెట్లో లోహాల ధరలకు రెక్కలు తెచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ పెరుగుదల మరిన్ని రికార్డులను సృష్టించేలా కనిపిస్తోంది.
దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో ఒక్కరోజే వెండి ఏకంగా రూ.7,600 మేర పెరిగి కిలో ధర రూ.2,43,443 వద్ద ఆల్‌టైమ్ హై రికార్డును నమోదు చేసింది. చైనా తన సరఫరాను నిలిపివేయడం, పారిశ్రామికంగా వెండికి డిమాండ్ పెరగడం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం వెండి అరుదైన లోహం జాబితాలోకి చేరిపోవడంతో డిమాండ్‌కు తగ్గ సప్లై లేక ధరలు గాలిలో తేలుతున్నాయి.
వెండితో పోటీ పడుతూ బంగారం ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,200 పెరిగి రూ.1,36,999 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ డిమాండ్ పెరగడం, అమెరికా డాలర్ విలువ తగ్గడం పసిడి ప్రియులకు శాపంగా మారింది. కేవలం ఇండియాలోనే కాదు, అమెరికా మార్కెట్లో కూడా గోల్డ్ ఫ్యూచర్స్ 4,387 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
కేవలం బంగారం, వెండి మాత్రమే కాదు, పారిశ్రామిక లోహమైన కాపర్ కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. ఎంసీఎక్స్‌లో కాపర్ ధర 1.50 శాతం పెరిగి కేజీ రూ.1,312 వద్ద కొనసాగుతోంది. చైనా మార్కెట్లలో డిమాండ్ పెరగడం వల్ల రాబోయే రోజుల్లో రాగి ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా లోహాల మార్కెట్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం వల్ల ధరలకు మద్దతు లభిస్తోంది. అలాగే డాలర్ ఇండెక్స్ బలహీనపడటం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు. చైనా సరఫరా గొలుసులో ఆటంకాలు వెండి ధరను కట్టడి చేయలేనంత స్థాయికి తీసుకెళ్లాయి. నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఏడాది లోహాల ధరలు పెరిగినప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే వృద్ధి రేటు కొంత స్థిరంగా ఉండవచ్చు.

