Silver Price : పాత రికార్డులు బ్రేక్.. 2025లో 100% పెరిగిన ధరలు.. ఇలా ఎందుకు పెరుగుతున్నాయి?
ఇలా ఎందుకు పెరుగుతున్నాయి?

Silver Price : 2025లో ప్రపంచవ్యాప్తంగా వెండి ధరలు రికార్డులు సృష్టించాయి. విదేశీ మార్కెట్లలో వెండి ధరలు 102% రాబడిని ఇవ్వగా, భారతదేశంలోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఏకంగా 108% పైగా రాబడిని అందించాయి. గత ఏడాది చివరి ట్రేడింగ్‌లో రూ.87,233 ఉన్న వెండి ధర, తాజాగా రూ.1,81,601 కి చేరింది. సోమవారం MCXలో వెండి ధర రూ.1,82,998తో జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. విదేశీ మార్కెట్‌లో 1979 తర్వాత వెండికి ఇదే అత్యుత్తమ సంవత్సరం.
వెండి ధరలు అసాధారణంగా పెరగడానికి ప్రధాన కారణాలు.. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్, ఉత్పత్తిలో కొరత. ప్రత్యేకించి సోలార్ ఎనర్జీ రంగంలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. 2024లో సోలార్ ప్యానెల్స్‌లో వెండి వాడకం 243.7 మిలియన్ ఔన్సులకు పెరిగింది. 2030 నాటికి సోలార్ సామర్థ్యం 4,000 GWకు చేరుతుందని అంచనా, ఇది వెండి డిమాండ్‌ను మరింత పెంచుతుంది. ఈ డిమాండ్‌తో పాటు, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటం కూడా వెండి ధరలకు మద్దతు ఇస్తుంది.
రూ.2 లక్షల స్థాయిని దాటుతుందా?
వెండి ధరలు చారిత్రక రికార్డులను దాటుతున్నందున, తదుపరి లక్ష్యం రూ.2 లక్షల మార్కు అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెల్త్ గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ అనుజ్ గుప్తా ప్రకారం.. పెరిగిన ETF (Exchange Traded Fund) డిమాండ్, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా దేశీయ మార్కెట్లలో వెండి ధరలు 2026 మొదటి త్రైమాసికంలో లేదా ఫిబ్రవరి-మార్చి మధ్య రూ.2,00,000 స్థాయిని తాకే అవకాశం ఉంది. ఈ బుల్లిష్ ట్రెండ్ కారణంగా దీర్ఘకాలికంగా వెండి అవుట్‌లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

