Silver Price : కిలో వెండి @3 లక్షలు..కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నిలువునా మునిగిపోతారు
కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నిలువునా మునిగిపోతారు

Silver Price : వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని వారాలుగా వెండి రేట్లు విపరీతంగా పెరగడంతో గ్రాము ధర రూ.300 వరకు, కిలో ధర ఏకంగా రూ.3 లక్షల మార్కును తాకింది. ధరలు పెరిగినప్పుడల్లా మార్కెట్లోకి నకిలీ వెండి నాణేలు, ఆభరణాలు, పాత్రల రాక కూడా పెరుగుతుంది. సామాన్య ప్రజలు మోసపోకుండా ఉండేందుకు నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు కొన్న వెండి అసలైందో కాదో తెలుసుకోవడానికి పెద్ద పెద్ద మిషన్లు అక్కర్లేదు, ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో కనిపెట్టేయవచ్చు.
ఇంట్లోనే వెండి స్వచ్ఛతను పరీక్షించే పద్ధతులు
వెండి ధరలు పెరిగినప్పుడు లాభం కోసం కొందరు వ్యాపారులు రాగి లేదా ఇతర చౌక లోహాలపై వెండి పూత పూసి అసలైన వెండిగా అమ్ముతుంటారు. వీటిని కనిపెట్టడానికి ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.
అయస్కాంత పరీక్ష : అసలైన వెండికి అయస్కాంత గుణం ఉండదు. ఒక శక్తివంతమైన అయస్కాంతాన్ని వెండి వస్తువు దగ్గరకు తీసుకెళ్లండి. అది అంటుకుంటే అందులో ఇనుము లేదా ఇతర లోహాలు కలిశాయని అర్థం. అయితే కొన్ని నకిలీ లోహాలు కూడా అయస్కాంతానికి అతుక్కోవు, కాబట్టి ఇది ప్రాథమిక పరీక్ష మాత్రమే.
మంచు ముక్క పరీక్ష : వెండికి ఉష్ణ వాహకత చాలా ఎక్కువ. వెండి నాణెం లేదా గొలుసుపై ఒక మంచు ముక్కను ఉంచండి. అది సాధారణం కంటే చాలా వేగంగా కరిగిపోతుంటే అది అసలైన వెండి కావడానికి అవకాశం ఉంది.
వాసన పరీక్ష : వెండిని కొద్దిగా రుద్ది వాసన చూడండి. అసలైన వెండికి ఎలాంటి వాసన ఉండదు. ఒకవేళ మీకు రాగి లేదా జింక్ వంటి లోహాల వాసన ఘాటుగా వస్తుంటే అందులో కల్తీ ఉన్నట్లే.
తెల్లని బట్టతో పరీక్ష : తెల్లటి శుభ్రమైన గుడ్డతో వెండి వస్తువును మెల్లగా రుద్దండి. గాలిలో ఉన్న ఆక్సిజన్ తో వెండి చర్య చెందడం వల్ల ఆ బట్టపై నల్లటి లేదా బూడిద రంగు మచ్చలు ఏర్పడాలి. అలా ఏమీ జరగకుండా వస్తువు మెరుస్తూనే ఉంటే అది కేవలం వెండి పూత మాత్రమే కావచ్చు.
నీటి పరీక్ష : వెండి సాంద్రత ఎక్కువ కాబట్టి నీటిలో వేయగానే అది వెంటనే అడుగుకు చేరుతుంది. తేలికపాటి లోహాలు అయితే కొంచెం వింతగా లేదా నెమ్మదిగా మునుగుతాయి.
శబ్దం పరీక్ష : వెండి నాణేన్ని కింద వేసినప్పుడు లేదా మరో లోహంతో కొట్టినప్పుడు అది టంగ్ మనే గంట వంటి స్పష్టమైన శబ్దాన్ని ఇస్తుంది. అదే నకిలీది అయితే బొంగురు పోయినట్లు లేదా మొద్దుబారిన శబ్దాన్ని ఇస్తుంది.
నిపుణుల సూచన ప్రకారం.. మీరు వెండి కొనేటప్పుడు కేవలం ఒక పరీక్షతో సరిపెట్టుకోకుండా రెండు మూడు రకాల పరీక్షలు చేయడం మంచిది. మరీ ముఖ్యంగా వెండి వస్తువులపై 925 లేదా BIS Hallmark ఉందో లేదో తనిఖీ చేయండి. అతి తక్కువ ధరకే వస్తుందని లేదా ఆఫర్ల పేరుతో రోడ్డు పక్కన అమ్మే వెండిని నమ్మి మోసపోవద్దు. వస్తువు మరీ ఎక్కువగా తళతళలాడుతున్నా, అమ్మకందారుడు తొందరపెడుతున్నా అనుమానించాల్సిందే. వెండి కొనేటప్పుడు ఎప్పుడూ నమ్మకమైన నగల దుకాణంలోనే కొనండి.. పక్కా బిల్లు అడగండి.

