అక్కడ కంటే మన దగ్గరే 17% తక్కువ

Silver Price : వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కాలంగా వెండి ఇచ్చిన రిటర్న్స్ చూసి ఇన్వెస్టర్లు ఖుషీ అవుతుంటే, ఇంట్లో పెళ్లిళ్లు ఉన్న సామాన్యులు మాత్రం ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ భారీ ధరల మధ్య ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మన పొరుగు దేశం చైనాతో పోలిస్తే భారత్‌లో వెండి ఏకంగా 17 శాతం తక్కువ ధరకే లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు రికార్డులు సృష్టిస్తున్నా, భారత్‌లో చైనా కంటే తక్కువ ధర ఉండటం వెనుక ఉన్న అసలు కారణాలు ఆసక్తికరంగా మారాయి.

అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ప్రస్తుతం ఒక ఔన్స్ వెండి ధర 109 డాలర్ల పైనే పలుకుతోంది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెండి ధరలు దాదాపు 44 శాతం పెరగగా, గత 12 నెలల కాలాన్ని గమనిస్తే ఏకంగా 250 శాతం పెరుగుదల నమోదైంది. అయితే చైనాలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అక్కడ వెండి ధర అంతర్జాతీయ రేట్ల కంటే ఎక్కువగా, అంటే ఒక ఔన్స్ 125 డాలర్ల వరకు చేరింది. అంటే చైనాలో వెండి కొనడం భారత్ కంటే చాలా భారంగా మారింది.

భారత్, చైనా ధరల మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తే.. ప్రస్తుతం భారత్‌లో ఒక గ్రాము వెండి ధర సుమారు రూ.335 గా ఉంది. దీని ప్రకారం ఒక ఔన్స్ (సుమారు 28.3 గ్రాములు) ధర భారత్‌లో రూ.9,984 అవుతుంది. కానీ, అదే చైనాలో ఒక ఔన్స్ వెండి ధర భారత కరెన్సీలో రూ.11,450కి పైగా ఉంది. అంటే చైనా కంటే భారత్‌లో వెండి సుమారు 17 శాతం తక్కువ ధరకే లభిస్తోంది. ఒక కిలో వెండిపై దాదాపు 20 వేల రూపాయల వరకు తేడా కనిపిస్తోంది.

ఈ భారీ ధరల తేడాకు ప్రధాన కారణం చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే. ప్రపంచ వెండి సరఫరాలో 65 శాతానికి పైగా వాటా చైనాదే. అయితే, జనవరి 1, 2026 నుంచి చైనా ప్రభుత్వం వెండి ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. ఇకపై వెండిని ఎగుమతి చేయాలంటే కంపెనీలు కచ్చితంగా ప్రభుత్వ లైసెన్స్ పొందాలి. ఈ నిబంధన 2027 వరకు అమల్లో ఉంటుంది. దీనివల్ల చిన్న ఎగుమతిదారులు మార్కెట్ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది, సరఫరా తగ్గి ధరలు పెరిగిపోతున్నాయి.

మరోవైపు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యే చైనా లూనార్ న్యూ ఇయర్ సెలవుల ప్రభావం కూడా మార్కెట్‌పై పడింది. ఈ పండుగ సమయంలో చైనాలో వెండికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రజలు పెద్ద ఎత్తున వెండిని నిల్వ చేసుకోవడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పైపైకి వెళ్తున్నాయి. ఇప్పటికే చైనాలో వెండి స్టాక్ తక్కువగా ఉండటం, మరోవైపు ఎగుమతులపై ఆంక్షలు ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, చైనాతో పోలిస్తే మన దగ్గర రేట్లు తక్కువగా ఉండటం భారత వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే విషయమే.

PolitEnt Media

PolitEnt Media

Next Story