భవిష్యత్తులో కిలో రేటు ఎంత ఉంటుందో తెలుసా?

Silver Price : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి మధ్య మదుపరులందరూ సురక్షితమైన పెట్టుబడుల వైపు అడుగులు వేస్తున్నారు. షేర్ మార్కెట్లలో ఒడిదుడుకులు భయపెడుతున్న వేళ, బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అయితే ఈ రేసులో బంగారం కంటే వెండి మరింత వేగంగా పరిగెడుతుందని, మున్ముందు వెండి ఇచ్చే రిటర్న్స్ చూసి ప్రపంచం షాక్ అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ ఆర్థిక రచయిత రిచ్ డాడ్ పూర్ డాడ్ ఫేమ్ రాబర్ట్ కియోసాకి చేసిన తాజా జోస్యం ఇప్పుడు ఇన్వెస్టర్లలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు రాబర్ట్ కియోసాకి వెండిపై ఎప్పటి నుంచో తనకున్న నమ్మకాన్ని మరోసారి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వెండిని ఆయన ఆధునిక కాలపు ఇనుముగా అభివర్ణించారు. అంటే పారిశ్రామిక యుగంలో ఇనుము ఎంత కీలకమో, నేటి సాంకేతిక యుగంలో వెండి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. 1990లలో కేవలం 5 డాలర్లుగా ఉన్న వెండి ధర, 2026 నాటికి 92 డాలర్లకు పైగా చేరుకోవడం గమనించాల్సిన విషయం. అయితే కియోసాకి అంచనా ప్రకారం, వెండి ధర ఇక్కడితో ఆగిపోదు. ఇది త్వరలోనే 200 డాలర్ల మార్కును చేరుకుంటుందని ఆయన భవిష్యవాణి వినిపిస్తున్నారు.

వెండి ధరలు ఇలా అకస్మాత్తుగా పెరగడానికి కేవలం ఆర్థిక అనిశ్చితి మాత్రమే కారణం కాదు. పారిశ్రామికంగా వెండికి పెరుగుతున్న అవసరాలే అసలైన కారణం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్లలో వెండిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఒకవైపు సరఫరా తగ్గిపోతుంటే, మరోవైపు టెక్నాలజీ కంపెనీల నుంచి వెండికి డిమాండ్ రెట్టింపు అవుతోంది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో మదుపరులు వెండిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని చూస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి 95 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా చూస్తే ఎంసీఎక్స్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.3.34 లక్షల గరిష్ట స్థాయిని తాకింది. గత తొమ్మిది రోజులుగా వెండి ధరలు తగ్గుముఖం పట్టకుండా వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఇక బంగారం విషయానికి వస్తే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే రూ.1.51 లక్షల మార్కును దాటేసింది. బంగారం ధర పెరగడం వల్ల అది సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లడంతో, మదుపరులందరూ వెండి వైపు మళ్ళుతున్నారు.

భారత రూపాయి విలువ పడిపోవడం కూడా వెండి, బంగారం ధరలు మన దేశంలో పెరగడానికి ఒక కారణం. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రాబోయే రోజుల్లో వెండి ధరల్లో మరిన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు, కానీ దీర్ఘకాలికంగా చూస్తే వెండి వెలుగులు మరింత ప్రకాశవంతంగా ఉంటాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగానికి వెండి వెన్నెముక కావడంతో, అది కేవలం ఆభరణంగానే కాకుండా ఒక విలువైన పారిశ్రామిక లోహంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. అందుకే ఇప్పుడు బంగారం కంటే వెండిలో పెట్టుబడి పెట్టడమే మేలని చాలా మంది నిపుణులు సలహా ఇస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story