Singareni signs accident insurance agreement worth Rs 1.25 crore with Punjab National Bank

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచనల మేరకు కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే కోటి రూపాయలు ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నప్పటికీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా సింగరేణి సంస్థ కుదుర్చుకున్న కోటి 25 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకం ఒక చారిత్రక ఘట్టమని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ఈ ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందినప్పుడు కంపెనీ ఇస్తున్న సహాయం కొంత ఉన్నప్పటికీ వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో బ్యాంకులతో మాట్లాడి ఈ తరహా ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అమలవుతున్న పథకాల వల్ల కార్మికుల కుటుంబాలకు గట్టి ఆర్థిక భరోసా లభించిందని అన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు కూడా మిగిలిన బ్యాంకుల అన్నిటికన్నా ఎక్కువగా కోటి 25 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రావడం, అలాగే సాధారణ మరణం సంభవించిన వారికి 10 లక్షల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ ను కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అమలు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా సింగరేణి పొరుగు సేవల ఉద్యోగుల కోసం 40 లక్షల రూపాయల ప్రమాద బీమా ఒప్పందాన్ని కూడా అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలను పెద్ద ఎత్తున చేపడుతోందని సోలార్ విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎలక్ట్రిసిటీ తదితర రంగాలలోకి ప్రవేశిస్తుందనీ, ఈ నేపథ్యంలో బ్యాంకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు పోతుందని పేర్కొన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో అండ్ ఎండీ శ్రీ అశోక్ చంద్ర మాట్లాడుతూ సింగరేణి సంస్థతో తాము కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఇతరులకు కూడా ఆదర్శప్రాయమని అన్నారు. ఈ పథకం నేటి నుండి సింగరేణి ఉద్యోగులకు అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా ఒప్పందాలను ఇతర శాఖలకు కూడా విస్తరించనున్నమని తెలియజేశారు. సింగరేణి వ్యాపార విస్తరణ ప్రాజెక్ట్ లకు తమ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సింగరేణితో కలిసి ముందడుగు వేయడం ఎంతో సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో సింగరేణి సంస్థ తరఫున ఇంకా డైరెక్టర్ ఆపరేషన్ శ్రీ ఎల్.వి సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్.డి.ఎం.సుభాని, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ ఎన్.వి.రాజశేఖర్ రావు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్ రీజినల్ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ చుగ్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు.
