ఎక్కువ ఫండ్స్‎లో పెడితే లాభం రాదంటున్న నిపుణులు

SIP Investors Alert : మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో, సిప్ ఇన్వెస్టర్లు తరచుగా ఒక సమస్యను ఎదుర్కొంటారు. ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలా? మంచి ఫండ్‌లు కనిపిస్తే, కొద్ది మొత్తాన్ని అందులో, కొద్ది మొత్తాన్ని ఇంకొక దాంట్లో పెట్టి తమ పోర్ట్‌ఫోలియోను గందరగోళంగా మార్చుకుంటారు. అయితే, ఎక్కువ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినంత మాత్రాన మెరుగైన రాబడి వస్తుందని అనుకోవడం పొరపాటని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ పోర్ట్‌ఫోలియోను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి అవసరమైన ఫండ్స్ సంఖ్య, నిపుణుల సలహాలు తెలుసుకుందాం.

మార్కెట్లో ఎన్నో మంచి మ్యూచువల్ ఫండ్‌లు అందుబాటులో ఉండటం వల్ల, చాలామంది సిప్ ఇన్వెస్టర్లు అన్నింటిలోనూ కొద్దికొద్దిగా పెట్టుబడి పెడుతుంటారు. దీని వల్ల పోర్ట్‌ఫోలియో గందరగోళంగా మారుతుంది. చాలామంది పెట్టుబడిదారులు, తమకు మంచిగా అనిపించిన ఫండ్‌లో స్వల్ప మొత్తాలు పెడుతూ పోతారు. ఇది వారి పోర్ట్‌ఫోలియోను నిర్వహించడం కష్టంగా మారుస్తుంది.

తమ పెట్టుబడులను క్రమం తప్పకుండా పర్యవేక్షించే, మార్కెట్‌పై సరైన అవగాహన ఉన్న ఇన్వెస్టర్లకు 5 నుంచి 6 మ్యూచువల్ ఫండ్‌లు ఉంటే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఫండ్‌లు ఉంటేనే పోర్ట్‌ఫోలియో బాగా వైవిధ్యంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది నిజం కాదు. ఇది కేవలం అపోహ మాత్రమే.

మీరు ఎంచుకున్న ఫండ్‌లు ఒకదానికొకటి ఎంత భిన్నంగా ఉన్నాయి. వాటి పెట్టుబడి వ్యూహం ఎంత బ్యాలెన్సింగ్ గా ఉంది అనేది ముఖ్యం. అన్ని ఫండ్‌లు ఒకే రకమైన షేర్లలో లేదా ఒకే సెగ్మెంట్‌లోని కంపెనీలలో పెట్టుబడి పెడితే, ఫండ్‌ల సంఖ్య పెరిగినా మార్కెట్ ఒక్కసారిగా పడిపోయినప్పుడు మీ పోర్ట్‌ఫోలియోపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒకే రకమైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టకుండా వేర్వేరు రంగాల్లో పెట్టుబడి పెట్టే ఫండ్స్‌ను ఎంచుకోవాలి.

మెరుగైన రాబడి, మార్కెట్ ఒడిదొడుకుల నుంచి రక్షణ పొందడానికి, పెట్టుబడి వ్యూహంలో వైవిధ్యం ఉండడం ముఖ్యం. ప్రతి ఈక్విటీ ఫండ్‌కు దానికంటూ ఒక ప్రత్యేకమైన ఇన్వెస్ట్ మెంట్ స్టైల్ ఉంటుంది. కొన్ని ఫండ్‌లు అధిక వృద్ధి సామర్థ్యం ఉన్న స్టాక్స్‌పై దృష్టి సారిస్తే, మరికొన్ని తక్కువ ధరలలో లభించే విలువ స్టాక్స్‌పై లేదా బలంగా ఉన్న క్వాలిటీ స్టాక్స్‌పై దృష్టి పెడతాయి.

మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి, మీ పోర్ట్‌ఫోలియోలో వేర్వేరు పెట్టుబడి వ్యూహాలు (ఉదాహరణకు, గ్రోత్ + వాల్యూ + బ్యాలెన్స్‌డ్ ఫండ్) పాటించే ఫండ్‌లను చేర్చడం చాలా ముఖ్యం. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో కూడా మీ పోర్ట్‌ఫోలియోలో బ్యాలెన్స్ ఉండేలా చూస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story