20 ఏళ్ల తర్వాత మీ చేతికి ఎంత వస్తుంది?

Mutual Funds : పెట్టుబడి విషయంలో టైమింగ్ కంటే టైమ్ చాలా ముఖ్యం. అంటే మార్కెట్ ఎప్పుడు బాగుంటుందో అని చూడటం కంటే, ఎంత ఎక్కువ కాలం మార్కెట్ లో ఉంటాం అనేది ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు మనకు రెండు మార్గాలు కనిపిస్తాయి. ఒకటి SIP- అంటే ప్రతినెలా ఒక నిర్ణీత మొత్తాన్ని దాచుకోవడం. రెండు Lumpsum - అంటే మన దగ్గర ఉన్న పెద్ద మొత్తాన్ని (ఉదాహరణకు లక్ష రూపాయలు) ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం. ఈ రెండింటిలో ఏది మెరుగో తెలియాలంటే ఈ కింద ఉన్న 20 ఏళ్ల విశ్లేషణ చూడండి.

15 శాతం రిటర్న్స్ సాధ్యమేనా?

చాలా మందికి 15 శాతం వడ్డీ అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ గత 20 ఏళ్ల భారతీయ మ్యూచువల్ ఫండ్స్ చరిత్రను చూస్తే.. మిడ్‌క్యాప్, ఫ్లెక్సీక్యాప్ వంటి ఫండ్స్ సగటున 15 నుంచి 18 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. అంటే సరైన ఫండ్‌ను ఎంచుకుని, క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగిస్తే 15 శాతం లాభం పొందడం పెద్ద కష్టమేమీ కాదు.

వెయ్యి ఎస్‌ఐపీ vs లక్ష లంప్సమ్

మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఒకేసారి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడం కంటే, ప్రతి నెలా రూ.1,000 చొప్పున 20 ఏళ్ల పాటు ఎస్‌ఐపీ చేయడం ద్వారా మీ పెట్టుబడి మొత్తం పెరుగుతుంది. నెలకు వెయ్యి రూపాయల చొప్పున 20 ఏళ్లలో (240 నెలలు) మీరు చేసే మొత్తం పెట్టుబడి రూ.2,40,000 అవుతుంది. అదే లంప్సమ్ పద్ధతిలో అయితే మీరు కేవలం రూ.1,00,000 మాత్రమే ఒకేసారి పెట్టుబడి పెడతారు. అంటే ఎస్‌ఐపీలో మీరు పెట్టిన అసలు మొత్తం లంప్సమ్ కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుంది.

అయితే, రాబడి విషయానికి వస్తే ఫలితాలు ఆసక్తికరంగా ఉంటాయి. 15 శాతం వార్షిక వడ్డీ రేటును ప్రాతిపదికగా తీసుకుంటే.. ప్రతి నెలా క్రమంగా చేసే ఎస్‌ఐపీ పెట్టుబడిపై మీకు రూ.10,87,073 అంచనా రిటర్న్స్ లభిస్తాయి. కానీ, ఒకేసారి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి 20 ఏళ్ల పాటు అలాగే వదిలేయడం వల్ల దానిపై లభించే అంచనా రిటర్న్స్ ఏకంగా రూ.15,36,654 గా ఉంటుంది. ఎందుకంటే లంప్సమ్ పద్ధతిలో మీ పూర్తి పెట్టుబడి మొదటి రోజు నుంచే చక్రవడ్డీ ప్రభావానికి లోనవుతుంది.

చివరగా 20 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత మీ చేతికి వచ్చే మొత్తం విలువను గమనిస్తే.. నెలకు రూ.1,000 చొప్పున చేసిన ఎస్‌ఐపీ ద్వారా మీకు రూ.13,27,073 లభిస్తాయి. అదే సమయంలో ఒకేసారి లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన లంప్సమ్ పెట్టుబడి విలువ రూ.16,36,654 కి చేరుకుంటుంది. దీన్ని బట్టి తక్కువ మొత్తంతో మొదలుపెట్టినప్పటికీ, ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఎక్కువ కాలం పాటు మార్కెట్‌లో ఉంచడం వల్ల సంపద సృష్టి వేగంగా జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story