ఒక బాటిల్‌ తాగాలంటే నెల జీతం పెట్టాల్సిందే

Yuvraj Singh : క్రికెట్ మైదానంలో తన ఆరు సిక్సర్లతో ప్రపంచవ్యాప్తంగా సిక్సర్ల కింగ్‎గా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్, ఇప్పుడు సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. యువీ అనేక మంది భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్తలతో కలిసి, భారతదేశంలో తన సొంత అల్ట్రా-ప్రీమియం టకీలా బ్రాండ్ అయిన ఫినోను అధికారికంగా ప్రారంభించాడు. గురుగ్రామ్‌లోని కోకాలో జరిగిన ఈ లాంఛ్ ఈవెంట్‌కు సురేశ్ రైనా, యుజువేంద్ర చాహల్, మొహమ్మద్ కైఫ్ వంటి క్రికెట్ దిగ్గజాలు హాజరై సందడి చేశారు. భారతదేశంలో పానీయం తాగే అనుభవాన్ని మార్చాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

యువరాజ్ సింగ్ బ్రాండ్ అయిన ఫినో టకీలాకు మెక్సికన్ మూలాలు ఉన్నాయి, కానీ దీనికి భారతీయ రుచిని కూడా జోడించారు. ఈ టకీలాను మెక్సికోలోని జలిస్కో హైలాండ్స్‌లో సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేస్తారు. ఇది 100% బ్లూ వెబర్ అగేవ్ నుంచి తయారవుతుంది. భారతదేశంలో ఈ బ్రాండ్‌కు ఆయేషా గుప్తు నాయకత్వం వహిస్తున్నారు. భారతదేశంలో ప్రీమియం స్పిరిట్స్ మార్కెట్‌లో ఫినోను అగ్రస్థానంలో నిలపడం ఆమె ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఫినో టకీలా ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలోని సెలెక్టెడ్ రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబైలలోని డ్యూటీ-ఫ్రీ స్టోర్లలో కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు.

ఫినో టకీలా మార్కెట్‌లో నాలుగు వేర్వేరు అల్ట్రా-ప్రీమియం వేరియంట్‌లను విడుదల చేసింది. ఈ బ్రాండ్ ధరలు చాలా ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రిపోర్టుల ప్రకారం భారతదేశంలో సగటు జీతం నెలకు రూ.25,000 నుంచి రూ.32,000 మధ్య ఉంది. ఈ ధరలను చూస్తే ఫినో ఒక బాటిల్ కొనుగోలు చేయడానికి సగటున ఒక నెల జీతం మొత్తం ఖర్చు చేయాల్సి రావొచ్చు. అత్యంత చవకైన వేరియంట్ బ్లాంకో ధర సుమారు రూ.13,889 కాగా, రెపోసాడో ధర రూ.19,175 వరకు ఉంది. అత్యంత ఖరీదైన వేరియంట్ రోసాడో ధర ఏకంగా రూ.34,038గా నిర్ణయించారు, ఇది బెర్రీ, పూల సువాసనతో గులాబీ రంగులో ఉంటుంది. అనెజో వేరియంట్ పొగాకు, పుచ్చకాయ, వెనీలా రుచులతో సుమారు రూ.30,478కి లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story