Slice : సేవింగ్స్ అకౌంట్ కి ఎఫ్డీ రేంజ్ వడ్డీ..బ్యాంకులకు బాస్ లా మారిన స్లైస్
బ్యాంకులకు బాస్ లా మారిన స్లైస్

Slice : సాధారణంగా మనం సేవింగ్స్ అకౌంట్‌లో దాచుకునే డబ్బుకు బ్యాంకులు ఏడాదికి 3 శాతం మించి వడ్డీ ఇవ్వడం చాలా అరుదు. కానీ, స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాత్రం ఏకంగా 5.25 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇది దాదాపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీతో సమానం. అయితే ఇందులో అసలైన కిక్కు వడ్డీ రేటులో మాత్రమే కాదు, ఆ వడ్డీని లెక్కించే పద్ధతిలో కూడా ఉంది. ఈ బ్యాంక్ తన ఖాతాదారులకు డైలీ కౌంపౌండింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది.
మిగిలిన బ్యాంకులు సాధారణంగా మూడు నెలలకు ఒకసారి వడ్డీని లెక్కిస్తాయి. అంటే మీరు జమ చేసిన అసలుపై మూడు నెలల తర్వాత వడ్డీ పడుతుంది. కానీ స్లైస్ బ్యాంక్‌లో మాత్రం ప్రతిరోజూ మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మీద ఆ రోజుకు సంబంధించిన వడ్డీని జమే చేస్తారు. మరుసటి రోజున ఆ వడ్డీ కలిసిన మొత్తం (అసలు + వడ్డీ) మీద మళ్ళీ వడ్డీ లెక్కిస్తారు. దీనినే చక్రవడ్డీ అంటారు. ఇలా రోజువారీ జరగడం వల్ల కస్టమర్లకు లాభం ఎక్కువగా ఉంటుంది.
ఒక చిన్న ఉదాహరణతో చూస్తే.. ఒకవేళ మీరు లక్ష రూపాయలను 7.75 శాతం వార్షిక వడ్డీ ఇచ్చే ఎఫ్డీలో పెడితే, మూడు నెలల చక్రవడ్డీ పద్ధతిలో ఏడాదికి రూ.7,946 లాభం వస్తుంది. అదే రోజువారీ చక్రవడ్డీ పద్ధతి అయితే ఆ మొత్తం రూ.7,980 అవుతుంది. అంటే ఇక్కడ అదనంగా రూ. 34 లాభం కనిపిస్తుంది. అదే 5.25 శాతం వడ్డీ రేటు వద్ద చూసుకుంటే, లక్ష రూపాయల మీద ఏడాదికి సుమారు రూ.22 అదనపు ఆదాయం లభిస్తుంది. వినడానికి ఈ మొత్తం చిన్నదిగా అనిపించినా, దీర్ఘకాలంలో, పెద్ద మొత్తంలో డబ్బు దాచుకునే వారికి ఇది మంచి లాభాన్ని ఇస్తుంది.
డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లలో లాక్ చేయాల్సిన అవసరం లేకుండానే, సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు ఉండటం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు, అత్యవసర నిధులు దాచుకునే వారికి స్లైస్ బ్యాంక్ ఒక చక్కని వేదికగా మారుతోంది. తక్కువ మొత్తంలో పొదుపు చేసే వారికి కూడా ప్రతిరోజూ తమ అకౌంట్లో చిల్లర పైసల రూపంలో వడ్డీ జమ అవ్వడం ఒక కొత్త అనుభూతినిస్తుంది.

