పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం

Interest Rates 2026 : కొత్త ఏడాది వేళ మధ్యతరగతి మదుపరులకు కేంద్ర ప్రభుత్వం తియ్యని కబురు అందించింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2026 మొదటి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనివల్ల పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వంటి పథకాల్లో డబ్బులు దాచుకునే కోట్లాది మంది సామాన్యులకు పాత వడ్డీ రేట్లే లభించనున్నాయి.

ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి 2026) కోసం కొత్త రేట్లను ప్రకటించాల్సి ఉండగా, డిసెంబర్ 31న విడుదల చేసిన అధికారిక మెమోరాండం ప్రకారం.. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్లో ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, సామాన్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ నిర్ణయం తర్వాత, వివిధ పథకాలపై లభించే వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

* సుకన్య సమృద్ధి యోజన (SSY): ఆడబిడ్డల భవిష్యత్తు కోసం చేసే ఈ పొదుపుపై అత్యధికంగా 8.2% వడ్డీ కొనసాగుతుంది.

* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): వృద్ధులకు భరోసానిచ్చే ఈ పథకానికి కూడా 8.2% వడ్డీ లభిస్తుంది.

* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): మధ్యతరగతి జీవుల ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన పీపీఎఫ్‌పై 7.1% వడ్డీ స్థిరంగా ఉంది.

* నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC): దీనిపై 7.7% వడ్డీ రేటును ప్రభుత్వం ఖరారు చేసింది.

* కిసాన్ వికాస్ పత్ర (KVP): పెట్టుబడి రెట్టింపు అయ్యే ఈ పథకంపై 7.5% వడ్డీ లభిస్తుంది.

* పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS): నెలనెలా స్థిర ఆదాయం కోరుకునే వారికి 7.4% వడ్డీ లభించనుంది.

నిజానికి, ప్రస్తుత ద్రవ్యోల్బణం, బాండ్ ఈల్డ్స్‌లో వస్తున్న మార్పుల దృష్ట్యా కేంద్రం వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మార్కెట్ నిపుణులు భావించారు. ముఖ్యంగా పీపీఎఫ్ రేట్లు తగ్గుతాయని ప్రచారం జరిగింది. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే దీర్ఘకాలికంగా పొదుపు చేసే మదుపరుల ఆదాయంపై భారీ ప్రభావం పడేది. అయితే ప్రభుత్వం రేట్లను మార్చకపోవడం ఇన్వెస్టర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ఇది వరుసగా రెండో త్రైమాసికం కావడం విశేషం.

స్థిరమైన ఆదాయం, ప్రభుత్వ భద్రత కోరుకునే వారికి ఈ పథకాలు ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్స్. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే పోస్టాఫీస్ పథకాలే మెరుగైన రిటర్న్స్ ఇస్తున్నాయి. పన్ను ప్రయోజనాలు (సెక్షన్ 80C) కూడా ఉండటంతో, 2026 ఆర్థిక ప్రణాళికలు వేసుకునే వారికి ఈ రేట్ల కొనసాగింపు కలిసిరానుంది. ఏప్రిల్ 2026 తర్వాత మళ్లీ కొత్త రేట్ల సమీక్ష ఉంటుంది. అప్పటివరకు ఈ వడ్డీలే వర్తిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story