Tempered Glass: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. స్మార్ట్‌ఫోన్ టెంపర్డ్ గ్లాసులు మరింత ప్రియం కానున్నాయా?
ప్రియం కానున్నాయా?

Tempered Glass: భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపధ్యంలో మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లు, టెంపర్డ్ గ్లాసుల నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మార్కెట్లో విక్రయించే స్క్రీన్ ప్రొటెక్టర్ల కోసం కఠినమైన నాణ్యతా ప్రమాదాలను తప్పనిసరి చేస్తూ సరికొత్త నిబంధనలను జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న గ్లాసులపై ఎలాంటి తక్షణ నిషేధం విధించనప్పటికీ రాబోయే కాలంలో ఇవి మరింత నాణ్యతతో కూడినవిగా మారనున్నాయి. ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఈ కేటగిరీని బీఐఎస్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లోకి తీసుకువచ్చారు.
ఏప్రిల్ 1, 2027 నుంచి కొత్త రూల్స్
కొత్త నిబంధనల ప్రకారం, 2027 ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో స్క్రీన్ ప్రొటెక్టర్లను తయారు చేసే లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతి కంపెనీ తప్పనిసరిగా BIS IS 19348:2025 ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. అంటే నాణ్యతా నిబంధనలను పాటించని ఏ ఉత్పత్తులను కూడా కంపెనీలు మార్కెట్లో విక్రయించడానికి వీలుపడదు. తయారీదారులు కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ ఉత్పత్తి విధానాన్ని మార్చుకోవడానికి ప్రభుత్వం తగిన సమయాన్ని కేటాయించింది. ఈ నిబంధనల వల్ల వినియోగదారులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన ప్రొటెక్టర్లు అందుబాటులోకి రానున్నాయి.
ఏయే అంశాలపై నాణ్యతా పరీక్షలు జరుగుతాయి?
కొత్త IS 19348:2025 ప్రమాణాల ప్రకారం స్క్రీన్ ప్రొటెక్టర్ల తయారీలో పలు రకాల కఠినమైన పరీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా గ్లాస్ మందం, బలం, ఉపరితల నాణ్యత, స్క్రీన్ క్లారిటీ, లైట్ ట్రాన్స్‌మిషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంతేకాకుండా అడెసివ్స్, యాంటీ-షాటర్ ఫిల్మ్, మొబైల్ స్క్రీన్‌కు ఉండే ఒలియోఫోబిక్ కోటింగ్, యాంటీ-గ్లేయల్, బ్లూ-లైట్ ఫిల్టర్, ప్రైవసీ ఫిల్మ్ వంటి ప్రత్యేక ఫీచర్ల కోసం కూడా స్పష్టమైన నాణ్యతా ప్రమాదాలను నిర్దేశించారు.
ప్యాకేజింగ్‌పై తప్పనిసరి వివరాలు
ఈ కొత్త నిబంధనల అమలు తర్వాత తయారీదారులు తమ ఉత్పత్తుల ప్యాకేజింగ్ పై కూడా కీలక సమాచారాన్ని ముద్రించాల్సి ఉంటుంది. ఇందులో తయారీదారు పేరు, బ్యాచ్ నంబర్, ప్రొడక్ట్ మందం వంటి వివరాలు స్పష్టంగా ఉండాలి. మార్కెట్లో ప్రస్తుతం పలు రకాల చవకైన, బ్రాండెడ్ లేని టెంపర్డ్ గ్లాసులు విరివిగా లభిస్తున్నాయి. అయితే కొత్త నిబంధనల వల్ల టెస్టింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పెరగడంతో తయారీ ఖర్చులు కొంత మారే అవకాశం ఉంది. ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ, మొబైల్ వినియోగదారులకు మాత్రం అత్యుత్తమ నాణ్యత గల స్క్రీన్ ప్రొటెక్టర్లు లభించే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

