సోనీ రూ.24,000 కోట్లు కట్టాల్సిందేనా?

Sony PlayStation Lawsuit : జపాన్ టెక్ దిగ్గజం సోనీకి ఇప్పుడు బ్రిటన్‌లో గట్టి షాక్ తగిలింది. తన పాపులర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ప్లేస్టేషన్ ద్వారా కోట్లాది మంది యూజర్ల దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా 1.22 కోట్ల మంది వినియోగదారుల తరపున సోనీపై దాదాపు 2 బిలియన్ పౌండ్ల (సుమారు రూ.24,567 కోట్లు) భారీ క్లాస్ యాక్షన్ దావా నమోదైంది. ఈ కేసు ఇప్పుడు లండన్‌లోని కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్‌లో విచారణకు సిద్ధంగా ఉంది. దీని ఫలితం మొత్తం ప్రపంచ గేమింగ్ పరిశ్రమపైనే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

వినియోగదారుల హక్కుల కార్యకర్త అలెక్స్ నీల్ నేతృత్వంలో ఈ న్యాయపోరాటం మొదలైంది. సోనీ సంస్థ తన ప్లేస్టేషన్ స్టోర్‌లో గేమ్‌లు లేదా ఇతర డిజిటల్ కంటెంట్ కొనుగోలుపై అత్యధిక, అన్యాయమైన ఛార్జీలు వసూలు చేసిందని దావాలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇతర కంపెనీల డౌన్‌లోడ్ స్టోర్లను అనుమతించకుండా మార్కెట్‌లో పోటీని అణచివేసిందని ఆరోపించారు. గేమ్ డెవలపర్లు, పబ్లిషర్ల నుంచి సోనీ ఏకంగా 30 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తోందని, ఆ భారం చివరకు అమాయకపు గేమర్ల జేబులకే చిల్లు పెడుతోందని బాధితులు వాదిస్తున్నారు. ఒకవేళ ఈ ఆరోపణలు కోర్టులో రుజువైతే, గేమింగ్ మార్కెట్ రూపురేఖలే మారిపోవచ్చు.

అయితే, ఈ ఆరోపణలను సోనీ తీవ్రంగా ఖండించింది. తన వ్యాపార నమూనా సరైనదేనని సమర్థించుకుంది. థర్డ్ పార్టీ స్టోర్లను అనుమతిస్తే యూజర్ల భద్రతకు, ప్రైవసీకి ముప్పు వాటిల్లుతుందని సోనీ వాదిస్తోంది. అంతేకాదు, తాము ప్లేస్టేషన్ హార్డ్‌వేర్ తయారీపై భారీగా పెట్టుబడి పెడతామని, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు కన్సోల్స్‌ను తక్కువ లాభానికే విక్రయిస్తామని కంపెనీ చెబుతోంది. డిజిటల్ కమీషన్ల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆ నష్టాలను భర్తీ చేసుకుంటామని సోనీ కోర్టులో తన వాదనను గట్టిగా వినిపిస్తోంది.

ఒకవేళ ఈ కేసులో సోనీ ఓడిపోతే, గత పదేళ్లుగా ప్లేస్టేషన్ స్టోర్‌లో గేమ్‌లు లేదా కంటెంట్ కొనుగోలు చేసిన యూజర్లకు భారీగా పరిహారం దక్కే అవకాశం ఉంది. ప్రతి యూజర్‌కు సగటున 162 పౌండ్లు (సుమారు రూ.17,000) వరకు లభించవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి అదనంగా 8 శాతం వడ్డీ కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కీలక కేసు విచారణ మార్చి 10 నుంచి లండన్ కోర్టులో ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమర్స్, టెక్ కంపెనీలు ఇప్పుడు ఈ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story