GST Rate Cut : మధుమేహం నుంచి ఊబకాయం వరకు.. రూ. 2 లక్షల వరకు తగ్గిన చికిత్స ఖర్చు
రూ. 2 లక్షల వరకు తగ్గిన చికిత్స ఖర్చు

GST Rate Cut : కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. గతంలో 12% పన్ను ఉన్న మందులపై ఇప్పుడు కేవలం 5% జీఎస్టీ ఉంటుంది. అంతేకాకుండా, 36 ముఖ్యమైన, ప్రాణరక్షక మందులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ ప్రకారం, ఈ నిర్ణయం మధ్యతరగతి కుటుంబాలకు, వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, డయాబెటిస్ నుంచి ఫ్యాటీ లివర్ వంటి వ్యాధుల చికిత్స ఖర్చు రూ. 2 లక్షల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
హెల్త్ సెక్టార్ కు లాభాలు
ఈ కొత్త పన్నుల విధానం వల్ల ఆరోగ్య రంగానికి అనేక లాభాలు లభిస్తాయి. ముఖ్యంగా, మందుల ధరలు తగ్గుతాయి. ఓవరాల్ టాక్స్ తగ్గించడం వల్ల అత్యవసర మందుల ధరలు కూడా తగ్గుతాయి, తద్వారా ఆరోగ్య రంగం మరింత మెరుగుపడుతుంది. ఈ కొత్త పన్ను విధానం వల్ల ప్రాణరక్షక మందుల స్థానిక ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో భారత్ ఫార్మాస్యూటికల్ రంగం మరింత బలంగా మారుతుంది.
క్యాన్సర్, అరుదైన వ్యాధులకు భారీ లాభం
ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (IPA) ప్రకారం, ఈ పన్నుల తగ్గింపు క్యాన్సర్, జన్యు సంబంధిత, అరుదైన వ్యాధులకు అయ్యే చికిత్స ఖర్చును తగ్గిస్తుంది. ఐపీఏ చేసిన అధ్యయనం ప్రకారం అరుదైన , దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ జీఎస్టీ రేట్ తగ్గింపు ఎలా ఉపయోగపడుతుందో కింద చూడండి.
అరుదైన వ్యాధులతో బాధపడేవారికి లాభాలు
భారతదేశంలో సుమారు 72.6 మిలియన్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. వీటిలో చాలా వ్యాధుల చికిత్సకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఐపీఏ ప్రకారం, 19 ఏళ్ల రోహన్ అనే యువకుడు ఫ్యాబ్రి వ్యాధి అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతడి చికిత్స కోసం గతంలో ఏటా దాదాపు రూ. 1.8 కోట్లు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఈ చికిత్సలపై జీఎస్టీ జీరో చేయడం వల్ల అతని కుటుంబం ఏటా రూ. 20 లక్షల వరకు ఆదా చేయగలదు.
రొమ్ము క్యాన్సర్ రోగులకు రూ. 4 లక్షల వరకు ఆదా
రొమ్ము క్యాన్సర్ ఉన్న రోగిపై చేసిన అధ్యయనం ప్రకారం, జీఎస్టీలో 5% తగ్గింపు వల్ల మందుల బిల్లు దాదాపు రూ. 4 లక్షలు తగ్గుతుంది. ఈ చికిత్సకు పెర్టుజుమాబ్, ట్రాస్టుజుమాబ్ అనే మందుల కాంబినేషన్ అవసరం. ఇది చాలా ప్రభావవంతమైన చికిత్సలలో ఒకటి. మందులు, ల్యాబ్ పరీక్షలు, డయాగ్నోస్టిక్స్ ఖర్చుల వల్ల రోగులకు ఆర్థిక భారం తగ్గుతుంది.
మధుమేహం రోగులకు రూ. 6,000 ఆదా
డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి జీఎస్టీ తగ్గింపు వల్ల మంచి లాభం ఉంటుంది. రోజువారీ ఇన్సులిన్, మందులు వాడాల్సిన రోగులకు ఏటా దాదాపు రూ. 6,000 ఆదా అవుతుంది.
ఆస్త్మా వ్యాధి రోగులకు రూ. 2,351 ఆదా
ఆస్త్మా రోగులు కూడా తమ చికిత్స, ఇన్‌హేలర్‌ల కోసం సంవత్సరానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక రోగిపై చేసిన ఐపీఏ అధ్యయనం ప్రకారం, అతడు రోజువారీ ఇన్‌హేలర్ కోసం ఏటా రూ. 37,620 ఖర్చు చేసేవాడు. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపుతో ఏటా దాదాపు రూ. 2,351 ఆదా చేయగలడు.
ఊబకాయం చికిత్సలో రూ. 2 లక్షల ఆదా
ఊబకాయంతో బాధపడుతున్న ఒక రోగిపై చేసిన అధ్యయనం ప్రకారం, జీఎస్టీ రేట్ల తగ్గింపుకు ముందు అతడి మందులు, పరీక్షలకు ఏటా దాదాపు రూ. 9 లక్షలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ముఖ్యమైన మందులపై జీఎస్టీ రేటు 5%కి తగ్గడం వల్ల చికిత్స ఖర్చు దాదాపు రూ. 2 లక్షల వరకు తగ్గుతుంది.
