Travel Agency : తక్కువ పెట్టుబడితో ట్రావెల్ ఏజెన్సీ ఎలా స్టార్ట్ చేయాలి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వివరాలివే
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వివరాలివే

Travel Agency : భారతదేశంలోని యువతలో కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనే ఉత్సాహం రోజురోజుకు పెరిగిపోతోంది. పర్వతాలు, సముద్రాలు, ఎడారులు, భిన్నమైన సంస్కృతులను చూడడానికి ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ కారణంగానే దేశంలో ట్రావెల్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందుతోంది. మీరు కూడా ప్రజల సెలవులను ప్రత్యేకంగా మారుస్తూ మంచి డబ్బు సంపాదించాలని అనుకుంటే, ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ ఒక అద్భుతమైన అవకాశం. సరైన ప్రణాళిక మరియు తక్కువ ఖర్చుతో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు.
ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించడంలో మొదటి, ముఖ్యమైన దశ సరైన రిజిస్ట్రేషన్. మొదటగా మీరు సోల్ ప్రొప్రైటర్‌షిప్, పార్టనర్‌షిప్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో దేనిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. ఇది మీ చట్టపరమైన బాధ్యత, భవిష్యత్తులో వ్యాపార విస్తరణపై ప్రభావం చూపుతుంది. మీ వ్యాపార నిర్మాణం నిర్ణయించిన తర్వాత, దానిని తప్పనిసరిగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ROC) కింద నమోదు చేయించుకోవాలి. మీ ఏజెన్సీ రైలు, బస్సు టిక్కెట్లను కూడా బుక్ చేయాలనుకుంటే, ఐఆర్‌సీటీసీ (IRCTC) ఏజెంట్ రిజిస్ట్రేషన్ తీసుకోవడం తప్పనిసరి.
మీ ఏజెన్సీకి మార్కెట్‌లో బెస్ట్ వాల్యూ, విశ్వసనీయత రావాలంటే, భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖలో రిజిస్ట్రేషన్ పొందడం చాలా ముఖ్యం. ఈ ప్రభుత్వ గుర్తింపు వల్ల కస్టమర్‌లు మీ సేవలను మరింత నమ్మకంగా వినియోగించుకుంటారు. ఈ నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో, పారదర్శకంగా పూర్తవుతుంది. MOT సర్టిఫికెట్ మీ ఏజెన్సీకి ప్రభుత్వ మద్దతు ఉన్నట్లు తెలియజేస్తుంది.
ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించడానికి అయ్యే ఖర్చు, మీరు ఎంచుకునే వ్యాపార స్థాయిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇంటి నుంచే పూర్తిగా డిజిటల్‌గా (ఫ్లైట్ టికెటింగ్, హోటల్ బుకింగ్) సేవలు అందించాలనుకుంటే, ప్రారంభ సెటప్‌కు సుమారు రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు ఖర్చు రావచ్చు. ఇందులో వెబ్‌సైట్, సాఫ్ట్‌వేర్ , మార్కెటింగ్ ఖర్చులు ఉంటాయి.
కస్టమర్‌లు నేరుగా వచ్చి బుక్ చేసుకునేలా చిన్న ఆఫీస్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే, ఆఫీస్ అద్దె, ఇంటీరియర్, జీతాలతో కలిపి సుమారు రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు పెట్టుబడి అవసరం కావచ్చు. IATA వంటి అంతర్జాతీయ గుర్తింపుతో, పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలనుకుంటే, బడ్జెట్ రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చేరవచ్చు.
నేటి కాలంలో ట్రావెల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది, ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో సరైన రిజిస్ట్రేషన్, బలమైన వ్యూహం, మంచి సేవలను అందించడం ద్వారా ట్రావెల్ ఏజెన్సీ అనేది తక్కువ ఖర్చుతో ప్రారంభించి మంచి లాభాలు సంపాదించగలిగే అద్భుతమైన వ్యాపార అవకాశం.

