Stock Market Crash : షేర్ మార్కెట్ షాక్.. 6 రోజుల్లో రూ. 19 లక్షల కోట్లు మటాష్
6 రోజుల్లో రూ. 19 లక్షల కోట్లు మటాష్

Stock Market Crash : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ ఏడాది ఆరంభం ఒక పీడకలలా మారింది. గత ఆరు వరుస ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్లు విపరీతంగా పడిపోతున్నాయి. గడిచిన ఆరు రోజుల్లోనే ఇన్వెస్టర్లు ఏకంగా రూ.19.06 లక్షల కోట్ల మేర నష్టపోయారు. సెన్సెక్స్ తన ఆల్-టైమ్ హై నుంచి సుమారు 4 శాతం వరకు దిగజారింది. సోమవారం ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 715 పాయింట్లు పడిపోయి 82,861 స్థాయికి చేరుకుంది. కేవలం ఆరు రోజుల్లోనే సెన్సెక్స్ మొత్తం 2,900 పాయింట్లకు పైగా కోల్పోవడం మార్కెట్ లో నెలకొన్న భయానక పరిస్థితిని సూచిస్తోంది.
కేవలం సెన్సెక్స్ మాత్రమే కాదు, నిఫ్టీ కూడా అదే బాటలో నడుస్తోంది. నిఫ్టీ ఈ ఆరు రోజుల్లో సుమారు 3.25 శాతం పడిపోయింది. జనవరి 5న 26,373 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకిన నిఫ్టీ, ప్రస్తుతం 900 పాయింట్లకు పైగా నష్టపోయింది. రాబోయే రోజుల్లో మార్కెట్ మరింత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మార్కెట్ ను ఇంతలా ముంచేస్తున్న ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మార్కెట్ పతనానికి 8 ప్రధాన కారణాలు:
అంతర్జాతీయ ఉద్రిక్తతలు : అమెరికాకు వెనిజులా, ఇరాన్‌లతో మొదలైన శత్రుత్వం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.
ముడి చమురు ధరల పెరుగుదల: ఇరాన్‌తో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి, క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. దీనివల్ల భారత్ దిగుమతి బిల్లు భారీగా పెరుగుతోంది.
అమెరికాతో ట్రేడ్ డీల్ విఫలం: భారత్-అమెరికా మధ్య జరగాల్సిన ట్రేడ్ డీల్ కుదరకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
విదేశీ ఇన్వెస్టర్ల పలాయనం : విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత్ నుంచి తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు.
రూపాయి విలువ క్షీణత: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకు పడిపోవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ద్రవ్యోల్బణం భయాలు: చమురు ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందనే ఆందోళన.
యూఎస్ బాండ్ యీల్డ్స్: అమెరికాలో బాండ్ యీల్డ్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల నుండి బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రాఫిట్ బుకింగ్: గరిష్ట స్థాయిల వద్ద ఉన్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడం కూడా పతనానికి కారణమైంది.
మొత్తం నష్టం ఎంత?
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఆధారంగా చూస్తే, జనవరి 2న రూ.481 లక్షల కోట్లుగా ఉన్న ఇన్వెస్టర్ల సంపద, సోమవారం నాటికి రూ.462 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఆరు రోజుల్లోనే రూ.19 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. సోమవారం ఒక్కరోజే సుమారు రూ.5.56 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. మార్కెట్ కోలుకోవడానికి ప్రస్తుతం ఎటువంటి సానుకూల సంకేతాలు కనిపించకపోవడం గమనార్హం.

