Stock Market Crash : షేర్ మార్కెట్లో భూకంపం.. గంటలో 3 లక్షల కోట్లు ఖాళీ
గంటలో 3 లక్షల కోట్లు ఖాళీ

Stock Market Crash : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు నేడు బ్లాక్ థర్స్ డేగా మిగిలిపోయింది. గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన గంటలోనే మదుపర్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో కూరుకుపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు. కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా రూ.3 లక్షల కోట్లు గాలిలో కలిసిపోయాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, దేశీయ ఆర్థిక పరిణామాలు వెరసి దలాల్ స్ట్రీట్‌ను కుదిపేస్తున్నాయి.
భారతీయ స్టాక్ మార్కెట్ నేడు తీవ్ర ఊగిసలాటలో చిక్కుకుంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోయి 81,707 స్థాయికి పడిపోగా, నిఫ్టీ 25,159 వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా 0.70 శాతం వరకు క్షీణించాయి. నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఆర్థిక సర్వే 2026 కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది.
మార్కెట్ పతనానికి 5 ప్రధాన కారణాలు:
అమెరికా-ఇరాన్ యుద్ధ మేఘాలు: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. అమెరికా దాడులు చేస్తే దీటుగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరించడం ప్రపంచ మార్కెట్లను భయపెట్టిస్తోంది. యుద్ధం వస్తే గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటుందనే భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.
రూపాయి చారిత్రక పతనం: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ధాటికి రూపాయి విలువ 92.00 స్థాయికి పడిపోయింది. రూపాయి బలహీనపడటం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం నష్టదాయకంగా మారుతుంది. ఇది మార్కెట్ పతనానికి ఆజ్యం పోసింది.
ముడి చమురు సెగ: ఇరాన్ ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2 శాతం పెరిగి 70 డాలర్లకు చేరుకుంది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి, చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి కంపెనీల లాభాలు తగ్గుతాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
బడ్జెట్ ముందస్తు జాగ్రత్తలు: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి ఇన్వెస్టర్లలో సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం పన్నుల్లో ఎలాంటి వెసులుబాటు ఇవ్వకపోవచ్చని, ఖర్చులను తగ్గించుకోవచ్చనే వార్తలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో రిస్క్ తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు.
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు: గత ఏడాది కాలంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ జనవరిలోనే ఇప్పటివరకు వారు రూ.43,000 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. భారీ మొత్తంలో జరుగుతున్న ఈ అమ్మకాలు మార్కెట్‌ను కిందకు లాగుతున్నాయి.

