1600 పాయింట్లు పతనమైన సెన్సెక్స్.. తలపట్టుకున్న ఇన్వెస్టర్లు

Stock Market Crash : ఇరాన్‌లో యుద్ధాన్ని నివారించడానికి పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. దీనికి తోడు, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధం చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హెచ్చరికలు మార్కెట్లో గందరగోళానికి దారితీశాయి. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా సరఫరా నిలిచిపోతుందనే భయంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా 100 డాలర్ల మార్కును దాటేశాయి. భారత్ వంటి దేశాలు చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడతాయి కాబట్టి, ధరల పెరుగుదల మన ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతుందని ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించడానికి పోటీ పడ్డారు.

నేడు ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1613 పాయింట్లు నష్టపోయి 75,937 స్థాయికి పడిపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 461 పాయింట్లు నష్టపోయి 23,589 వద్ద కీలక మద్దతు స్థాయిని కోల్పోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉండటం మార్కెట్లను మరింత కుంగదీసింది. ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లు కూడా నష్టాల బాట పట్టాయి.

ముడిచమురు ధరలు పెరగడం వల్ల చమురు ఉత్పత్తి చేసే సంస్థలకు మాత్రం లాభాలు చేకూరాయి. ఓఎన్‌జీసీ షేర్లు దాదాపు 4.85 శాతం పెరగగా, ఆయిల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు యుద్ధ వాతావరణం నెలకొనడంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వంటి రక్షణ రంగ షేర్లకు కూడా గిరాకీ పెరిగింది. అయితే ఆటోమొబైల్, టైర్ కంపెనీలు, ఏవియేషన్ రంగం షేర్లు మాత్రం విపరీతంగా పడిపోయాయి.

భారత మార్కెట్లే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి భారీగా నష్టపోయాయి. ఇక అమెరికాలోని వాల్ స్ట్రీట్ కూడా కుదేలైంది. డౌ జోన్స్ ఫ్యూచర్స్ 550 పాయింట్ల పతనంతో ఉండగా, నాస్‌డాక్ కూడా భారీ నష్టాలను చవిచూస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లు కుదుటపడి, చమురు ధరలు తగ్గితే తప్ప భారత మార్కెట్లు మళ్లీ పుంజుకోవడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story