వారం రోజుల్లో 8 కంపెనీలకు రూ.2 లక్షల కోట్ల లాభం

Stock Market : గత వారం భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు చాలా లాభదాయకంగా నిలిచింది. బలహీనత తర్వాత మార్కెట్ పుంజుకోవడంతో.. సెన్సెక్స్, నిఫ్టీలలో దాదాపు 1.6 శాతం పైగా పెరుగుదల కనిపించింది. దీని ఫలితంగా దేశంలోని టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారీ వృద్ధి నమోదైంది. మొత్తంగా టాప్ 10 కంపెనీల్లో 8 కంపెనీల విలువ రూ.2,05,185.08 కోట్ల మేర పెరిగింది. ఈ లాభాల్లో సింహభాగం కేవలం రెండు కంపెనీలకే దక్కింది.

గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,346.5 పాయింట్లు (1.62 శాతం), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 417.75 పాయింట్లు (1.64 శాతం) పెరిగాయి. ఈ వృద్ధి కారణంగా 8 అగ్రశ్రేణి కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా రూ.55,652.54 కోట్ల మేర లాభపడింది. దీని ప్రస్తుత విలువ రూ.11,96,700.84 కోట్లు. దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ విలువ రూ.54,941.84 కోట్ల మేర పెరిగింది. ప్రస్తుత ఎం క్యాప్ రూ.20,55,379.61 కోట్లు. అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ మార్కెట్ విలువ కూడా రూ.40,757.75 కోట్ల మేర పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రెండు కంపెనీలు కలిపి దాదాపు రూ.1.10 లక్షల కోట్ల మేర లాభపడ్డాయి.

బ్యాంకులు, ఇతర కంపెనీల వృద్ధి

ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ విలువ రూ.20,834.35 కోట్ల మేర పెరిగింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ విలువ రూ.10,522.9 కోట్ల మేర పెరిగింది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.10,448.32 కోట్ల మేర పెరిగింది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ రూ.9,149.13 కోట్ల మేర పెరిగింది. అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ విలువ కూడా రూ.2,878.25 కోట్ల మేర పెరిగింది.

8 కంపెనీలకు భారీ లాభాలు దక్కినప్పటికీ, రెండు కంపెనీలు మాత్రం నష్టాలను చవిచూశాయి. ఈ రెండు కంపెనీల మొత్తం నష్టం కలిపి దాదాపు రూ.40 వేల కోట్ల వరకు ఉంది. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ.30,147.94 కోట్ల మేర తగ్గింది. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ.9,266.12 కోట్ల మేర తగ్గింది.

ప్రస్తుత ర్యాంకింగ్

గత వారం లాభ నష్టాల తర్వాత, మార్కెట్ విలువ ఆధారంగా టాప్ 10 కంపెనీల ర్యాంకింగ్ ఈ విధంగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎల్‌ఐసీ, హిందుస్థాన్ యూనిలీవర్.

PolitEnt Media

PolitEnt Media

Next Story