కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ

Stock Market : బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్‌లో వణుకు మొదలైంది. గత మూడు రోజులుగా లాభాల్లో దూసుకుపోయిన మార్కెట్లు, గురువారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతుండటంతో దలాల్ స్ట్రీట్‌లో ఆందోళన నెలకొంది. ఆర్థిక సర్వే అంచనాలు బాగున్నప్పటికీ, అంతర్జాతీయ పరిణామాలు, అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను పాతాళానికి నెట్టేస్తున్నాయి. బడ్జెట్ 2026 ప్రవేశపెట్టడానికి ముందే స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బిఎస్ఈ (BSE) సెన్సెక్స్ ఏకంగా 619 పాయింట్లు నష్టపోయి 81,947 స్థాయికి పడిపోయింది. అటు నిఫ్టీ కూడా 171 పాయింట్ల నష్టంతో 25,248 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆర్థిక సర్వేలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రభుత్వం చెప్పినప్పటికీ, ఇన్వెస్టర్లలో ఉన్న భయాందోళనలు మార్కెట్‌ను కిందికి లాగేస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ఈ పతనానికి ప్రధాన కారణం. ఈ జనవరి నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు సుమారు రూ.43,686 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు కొంతవరకు అడ్డుకున్నప్పటికీ, విదేశీ నిధుల వెల్లువ ఆగకపోవడంతో మార్కెట్ ఒత్తిడికి లోనవుతోంది.

మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. గురువారం రూపాయి విలువ రికార్డు స్థాయిలో 91.9850కి చేరింది. రూపాయి బలహీనపడటం వల్ల కంపెనీల దిగుమతి ఖర్చులు పెరిగి, లాభదాయకత తగ్గుతుందనే ఆందోళన నెలకొంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల అంశంగా మారింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు గ్లోబల్ ట్రేడ్‌ను అనిశ్చితిలోకి నెట్టాయి. ఈ పరిణామాలు భారత మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

సెెక్టోరల్ ఇండెక్స్‌ల విషయానికి వస్తే.. ఐటీ, మెటల్ రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతం కంటే ఎక్కువ క్షీణించగా, మెటల్ ఇండెక్స్ ఏకంగా 4 శాతం మేర కుప్పకూలింది. టాటా స్టీల్, హిందాల్కో వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు కూడా ఎరుపు రంగులోనే ట్రేడ్ అవుతున్నాయి. బడ్జెట్‌లో పన్నుల మార్పులు ఎలా ఉంటాయో అనే సందిగ్ధంలో ఉన్న ఇన్వెస్టర్లు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బడ్జెట్ కు ముందు ఇటువంటి ఒడిదుడుకులు సహజమే. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ.. మార్కెట్ ప్రస్తుతం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. బ్రెన్ట్ క్రూడ్ ధరలు పెరగడం, అమెరికా వాణిజ్య విధానాల్లో మార్పులు భారత మార్కెట్‌కు పెద్ద అడ్డంకులుగా మారాయని ఆయన విశ్లేషించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు మార్కెట్‌లో ఇదే తరహా అస్థిరత కొనసాగే అవకాశం ఉందని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story