Solar Panel : కరెంటు బిల్లుతో సతమతమవుతున్నారా? ఇలా చేస్తే తిరిగి మీదే సంపాదించుకోవచ్చు
ఇలా చేస్తే తిరిగి మీదే సంపాదించుకోవచ్చు

Solar Panel : వేసవి వచ్చిందంటే చాలు, ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, గీజర్‌లు వంటి ఎలక్ట్రిక్ ఉపకరణాలు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. దీంతో కరెంటు మీటరు పరుగులు తీస్తుంది, నెలవారీ బిల్లు వేలల్లో వచ్చి జేబుకు చిల్లు పడుతుంది. ఈ కారణంగానే ఈ రోజుల్లో చాలా మంది సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అసలు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా లాభదాయకమేనా? దీనికి ఎంత ఖర్చవుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం.
సోలార్ ప్యానెల్స్ ఎలా పని చేస్తాయి?
సోలార్ ప్యానెల్స్ సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చే పని చేస్తాయి. వీటిలో ఉండే సోలార్ సెల్స్ (Photovoltaic Cells) సూర్యకిరణాల నుంచి శక్తిని గ్రహించి, దాన్ని విద్యుత్‌గా మారుస్తాయి. ఆ తర్వాత ఆ విద్యుత్‌ను ఇంట్లో ఫ్యాన్లు, బల్బులు, ఫ్రిజ్ లేదా ఏసీ వంటివి నడపడానికి ఉపయోగించుకోవచ్చు.
ఖర్చు ఎంత అవుతుంది?
సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు మీ ఇంటి అవసరాలు, విద్యుత్ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. మీ ఇంట్లో 1 కిలోవాట్ (kW) సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తే, దానికి రూ.70,000 నుండి రూ.85,000 వరకు ఖర్చు కావచ్చు. ఈ సిస్టమ్‌తో మీ ఇంట్లో 3-4 ఫ్యాన్లు, 5-6 LED లైట్లు సులభంగా నడుస్తాయి. ఒకవేళ మీరు ఆన్-గ్రిడ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంటే అది కొంచెం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అంతేకాకుండా, మీరు అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ప్రభుత్వానికి తిరిగి అమ్మి డబ్బు సంపాదించవచ్చు.
భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా సోలార్ ప్యానెల్‌ల ఏర్పాటుపై సబ్సిడీని అందిస్తున్నాయి. ప్రస్తుతం, MNRE (Ministry of New and Renewable Energy ) ద్వారా 20% నుండి 50% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీని కోసం మీరు మీ రాష్ట్రంలోని డిస్కామ్ ను సంప్రదించాలి. అప్రూవ్డ్ వెండర్ ద్వారా సోలార్ ప్యానెల్‌లను ఇన్‌స్టాల్ చేయించుకోవాలి. ఈ ఖర్చులో సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్, బ్యాటరీ, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, వైరింగ్, సపోర్ట్ స్ట్రక్చర్, మీటర్, కనెక్షన్ ఫీజులు అన్నీ కలిపి ఉంటాయి.
ఎన్ని సంవత్సరాల్లో పెట్టుబడి తిరిగి వస్తుంది?
సాధారణంగా ఒక సోలార్ ప్యానెల్ సిస్టమ్ 4 నుండి 6 సంవత్సరాలలో దాని ప్రారంభ పెట్టుబడిని తిరిగి పొందుతుంది. ఆ తర్వాత 20-25 సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ లభిస్తుంది. అంటే, దీర్ఘకాలంలో ఇది చాలా లాభదాయకంగా చెప్పొచ్చు.
ఎవరికి సోలార్ ప్యానెల్స్ సరిపోతాయి?
ఎవరి ఇంటి పైకప్పుపై మంచి ఎండ పడుతుందో వారికి ఇది చాలా లాభదాయకం. ఎవరి కరెంటు బిల్లు రూ.1,000 కంటే ఎక్కువగా వస్తుందో వారికి ఉపయోగంగా ఉంటుంది. ఎవరైతే దీర్ఘకాలం పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా నిరంతరాయ విద్యుత్ కావాలనుకుంటారో వారికి సోలార్ ప్యానెల్స్ సరైనవని చెప్పొచ్చు.
