Sudha Murty : వర్క్ ఫ్రమ్ హోమ్ ముద్దు.. పెట్రోల్ ఖర్చులు వద్దు.. ప్రధాని మోదీ పిలుపుకు సుధామూర్తి జై
ప్రధాని మోదీ పిలుపుకు సుధామూర్తి జై

Sudha Murty : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కీలక విజ్ఞప్తికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్‌పర్సన్ సుధామూర్తి ప్రధాని సూచనలను మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, దిగుమతి చేసుకునే వస్తువులపై ఆధారపడటం తగ్గించుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా సుధామూర్తి తన స్పందనను తెలియజేశారు. "గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇంధనాన్ని పొదుపుగా వాడటం, సాధ్యమైనంత వరకు వర్చువల్ మీటింగ్స్ నిర్వహించుకోవడం చాలా మంచి నిర్ణయం. పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభం వల్ల సరఫరా గొలుసు దెబ్బతింది. ఇలాంటి సమయంలో మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి పౌరుడు సహకరించాలి" అని ఆమె పేర్కొన్నారు. ఆఫీసులకు వెళ్లడం కంటే ఇంటి నుంచే పని చేయడం లేదా వీడియో కాల్స్ ద్వారా సమావేశాలు ముగించడం వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని ఆమె సూచించారు.
కేవలం సుధామూర్తి మాత్రమే కాకుండా.. ప్రముఖ ఇన్వెస్టర్ మోహన్ దాస్ పాయ్ కూడా ప్రధాని విజ్ఞప్తిని సమర్థించారు. గ్లోబల్ క్రైసిస్ నడుస్తున్న వేళ ప్రజలు అనవసర ఖర్చులను తగ్గించుకోవడం వివేకవంతమైన చర్య అని ఆయన అన్నారు. చమురు దిగుమతులను తగ్గించేందుకు పౌరులు తమ వంతు బాధ్యతగా సిద్ధపడాలని పాయ్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇటీవల విదేశీ యాత్రలు, బంగారం కొనుగోళ్లు కూడా ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే.
సుధామూర్తి మద్దతు పలికిన నేపథ్యంలో ఆమె గతంలో రాజ్యసభలో చేసిన ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ రేట్ల పెరుగుదలపై అప్పట్లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. "ధరల పెరుగుదల అనేది మన దేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల జరుగుతున్నది కాదు. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాలు, గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులే ఇందుకు కారణం. మనం యుద్ధం ప్రారంభించలేదు, మనం ధరలు పెంచమని అడగలేదు. కానీ గ్లోబల్ పరిస్థితుల ప్రభావం మనపై పడుతోంది" అని ఆమె వివరించారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాల వల్ల క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనివల్ల భారతదేశ విదేశీ మారక నిల్వలు హరించుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రధాని మోదీ వర్క్ ఫ్రమ్ హోమ్, కార్ పూలింగ్, మెట్రో రైళ్ల వాడకం వంటి ప్రత్యామ్నాయాలను సూచించారు. ఈ సూచనలను పారిశ్రామిక దిగ్గజాలు కూడా సమర్థిస్తుండటంతో, రానున్న రోజుల్లో కార్పొరేట్ సంస్థలు మళ్ళీ వర్చువల్ మీటింగ్స్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.

