Sugar Price: ఇథనాల్ వల్లే పంచదార ప్రియమైందా?.. షాకింగ్ వివరాలు వెల్లడించిన కేంద్రం
షాకింగ్ వివరాలు వెల్లడించిన కేంద్రం

Sugar Price: దేశంలో గత కొన్ని వారాలుగా చక్కెర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే కిలో పంచదార ధర రూ.7.50 పైగా పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. అయితే, ఈ ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కారణం కాదని స్పష్టం చేసిన ప్రభుత్వం, నిత్యావసర సరుకు ధరను అదుపు చేసేందుకు రంగంలోకి దిగింది. గత నెల జూలై 20వ తేదీన కిలో చక్కెర సగటు సగటు ధర రూ.48.18 గా ఉండగా, ఆగస్టు 20 నాటికి అది రూ.55.70కి చేరింది. కేవలం ఒకే నెల వ్యవధిలో కిలోపై ఏకంగా రూ.7.52 పెరగడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీనితో మార్కెట్‌లో పంచదార ధరల మంట వెనుక ఇథనాల్ ఉత్పత్తి ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇథనాల్ తయారీ కోసం కేటాయించే చక్కెర శాతం 2022-23లో 12 శాతంగా ఉండగా, 2025-26 నాటికి అది 9 శాతానికి తగ్గిందని గణాంకాలతో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న ఇథనాల్‌లో మూడు వంతుల భాగం మొక్కజొన్న లాంటి ధాన్యాల నుంచే వస్తోందని తెలిపింది.
దిగుబడి తగ్గడానికి గల ప్రధాన కారణాలు
ఈ సీజన్‌లో దేశంలో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులకు పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రారంభంలో చెరకు ఉత్పత్తిదారులు 343 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని భావించినప్పటికీ, పంటలకు సోకిన తెగుళ్లు, పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, నీరు నిలిచిపోవడం వల్ల దిగుబడి దెబ్బతింది. అయితే దేశీయంగా అక్టోబర్ నాటికి కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా పంచదార కొరత తీవ్రమవుతోందని, అంతర్జాతీయ మార్కెట్‌లో గత రెండు నెలల్లోనే ధరలు 16 శాతానికి పైగా పెరిగాయని పేర్కొంది.
బ్లాక్ మార్కెటింగ్‌పై ఆంక్షల అస్త్రం
ధరలను కట్టడి చేసేందుకు కేంద్రం వ్యాపారులపై ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు వర్తించేలా 400 టన్నుల స్టాక్ లిమిట్ విధించింది. సెప్టెంబర్ 1 నుంచి బల్క్ కొనుగోలుదారులు 15 రోజులకు సరిపడా నిల్వలను మాత్రమే ఉంచుకోవాలని స్పష్టం చేసింది. స్టాక్ పరిమితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలు మిల్లుల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. దేశీయంగా సరఫరాను పెంచేందుకు 10 లక్షల టన్నుల రా షుగర్ ఉచిత దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 15 నుంచే మిల్లుల్లో క్రషింగ్ ప్రారంభించాలని సూచించడంతో, ఆ నెలలో చక్కెర ఉత్పత్తి సాధారనంగా వచ్చే 3-4 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నులకు పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చక్కెర ధరలను నియంత్రించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలతో రాబోయే రోజుల్లో మార్కెట్‌లో ధరలు స్థిరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అటు వినియోగదారులకు భారం కాకుండా, ఇటు రైతుల చెరకు బకాయిల్లో 97 శాతం ఇప్పటికే చెల్లించి వారి ప్రయోజనాలను కాపాడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

