Sugar Price: దేశ వ్యాప్తంగా వంటింటి బడ్జెట్‌పై తీపి భారంతో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. పంచదార దిగుమతులపై సుంకాల మినహాయింపు ఇవ్వడం, వ్యాపారుల నిల్వలపై పరిమితులు విధించడం లాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఫలితం కనిపించడం లేదు. దేశంలో సగటు రీటైల్ ధర కిలోకు రూ.64.24గా నమోదైంది. ప్రధాన నగరాల విషయానికి వస్తే ఢిల్లీలో రూ.62, చెన్నైలో రూ.63, ముంబైలో రూ.66 కాగా కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా రూ.74 వరకు విక్రయిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ధర ఏకంగా 38.63 శాతం పెరగడం సామాన్యులను కలవరానికి గురిచేస్తోంది.

మిల్లుల్లో తగ్గుతున్నా షాపుల్లో ఎందుకీ బాదుడు?

హోల్‌సేల్ మార్కెట్లో సైతం పంచదార ధర కిలోకు రూ.59.73 వద్ద కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల టన్నుల ముడి పంచదారను ఉచిత దిగుమతికి అనుమతించిన తర్వాత సుమారు 20 శాతం మేర మిల్లుల వద్ద ధరలు తగ్గాయి. సాధారణంగా మిల్లు ధరలకు, రీటైల్ ధరలకు నడుమ రూ.7 నుంచి రూ.8 వ్యత్యాసం మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. హోల్‌సేల్ వ్యాపారులు, రీటైలర్లు మధ్య దళారుల వ్యవస్థ కారణంగా మిల్లుల్లో తగ్గిన ప్రయోజనం నేరుగా వినియోగదారుడికి అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్పత్తి అంచనాలు తగ్గడమే అసలు కారణమా?

ధరలు పెరగడానికి కారణం మిల్లు యజమానుల తీరేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దేశంలో సరిపడా పంచదార నిల్వలు ఉన్నాయని తేల్చి చెప్పింది. 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి గాను పంచదార ఉత్పత్తి అంచనాలు ముందుగా అనుకున్న 343 లక్షల టన్నుల నుంచి 306 లక్షల టన్నులకు పడిపోయాయి. అయితే దేశీయంగా ఏటా అవసరమయ్యే పంచదార వినియోగం 280 నుంచి 285 లక్షల టన్నులు మాత్రమే. వినియోగానికి మించిన ఉత్పత్తి ఉన్నప్పటికీ మార్కెట్లో కంటిన్యూగా ధరలు పెరగడం వెనుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

రానున్న పండగల వేళ మరింత భయం

భారతదేశంలో వరుసగా పండగల సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ స్థాయిలో పంచదార ధరలు మండటం సామాన్య ఇళ్లతో పాటు స్వీట్ షాపుల యజమానులను భయపెడుతోంది. కేంద్రం ఇప్పటికే పంచదార ఎగుమతులపై సంపూర్ణ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెడుతున్నా కూడా బహిరంగ మార్కెట్లో ధరలు అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో రీటైల్ మార్కెట్ పై ప్రత్యేక నిఘా ఉంచకపోతే సామాన్యుడి తీపి కలలు చేదుగా మారే ప్రమాదం ఉంది.

Next Story