ఆర్‌సీబీ జెర్సీపై సన్ ఫార్మా లోగో

IPL 2026 Sponsorship : భారతదేశపు అగ్రశ్రేణి ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మూడు సంవత్సరాల పాటు ప్రిన్సిపల్ స్పాన్సర్‌గా, హెల్త్ పార్ట్‌నర్‌గా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు కేవలం హాస్పిటల్స్, మెడికల్ షాపులకే పరిమితమైన తన బ్రాండ్ ఇమేజ్‌ను, దేశంలో అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్ ద్వారా సామాన్య ప్రజలకు మరింత దగ్గర చేయాలనేది కంపెనీ ఉద్దేశం. ఈ ఒప్పందంలో భాగంగా, ఆర్‌సీబీ ఆటగాళ్లు ధరించే ఎరుపు, నలుపు రంగుల మ్యాచ్ జెర్సీకి ముందు భాగంలో సన్ ఫార్మా లోగో ప్రముఖంగా కనిపిస్తుంది. కేవలం మ్యాచ్ జెర్సీ మాత్రమే కాకుండా, టీం ట్రైనింగ్ కిట్స్, గ్రీన్ మ్యాచ్ కిట్‌పై కూడా బ్రాండింగ్ ఉంటుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే హోమ్ మ్యాచ్‌ల సమయంలో స్టేడియం అంతటా భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వడం ద్వారా బ్రాండ్‌కు విపరీతమైన గుర్తింపు లభిస్తుందని కంపెనీ భావిస్తోంది.

భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, అదొక భావోద్వేగం అని సన్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి గణోర్కర్ తెలిపారు. ఆర్‌సీబీ జట్టుకు ఉన్న పట్టుదల, ఆవిష్కరణలు తమ కంపెనీ విలువలతో సరిపోలుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిత్యం నమ్మే ఔషధాలను తయారు చేసే తమ సంస్థ, ఇప్పుడు వారి అభిమాన క్రీడ ద్వారా మరింత దగ్గర కానుండటం విశేషం. ముఖ్యంగా ఐపీఎల్ వంటి శక్తివంతమైన వేదిక ద్వారా తమ "పేషెంట్-సెంట్రిక్" ఉద్దేశ్యాన్ని చాటిచెప్పాలని కంపెనీ చూస్తోంది.

ఐపీఎల్ ప్రస్తుత ఛాంపియన్ అయిన ఆర్‌సీబీ, ఈ ఒప్పందాన్ని కేవలం స్పాన్సర్‌షిప్‌కు మాత్రమే పరిమితం చేయట్లేదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్,మ్యాచ్ డే అనుభవాల ద్వారా అభిమానులతో అనుబంధాన్ని పెంచుకోవాలని టీమ్ సీఓఓ రాజేష్ మీనన్ తెలిపారు. ఫ్యాన్స్‌కు జట్టుతో పాటు సన్ ఫార్మా బ్రాండ్‌తో కూడా కొత్త రకమైన అనుభూతిని అందించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. సన్ ఫార్మా ఇటీవల ప్రారంభించిన ప్రతి నిమిషం 1000 మంది ప్రాణాలను తాకడం అనే కార్పొరేట్ క్యాంపెయిన్‌కు కూడా ఈ స్పాన్సర్‌షిప్ మంచి బూస్ట్ ఇవ్వనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story