Online Gaming : భారతదేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోలుకోలేని భారీ షాక్ ఇచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా బ్యాక్‌డేట్ (పాత తేదీల) నుంచి ఆన్‌లైన్ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీ వసూలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. ఈ పన్ను విధింపునకు వ్యతిరేకంగా డెల్టా కార్ప్‎తో పాటు పలు ప్రముఖ గేమింగ్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై 28 శాతం చొప్పున రెట్రోస్పెక్టివ్ జీఎస్టీ వసూలు చేయడం రాజ్యాంగబద్ధంగా పూర్తిగా చెల్లుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక తీర్పుతో.. కేంద్ర పన్నుల శాఖ గేమింగ్ కంపెనీలకు పంపిన వేల కోట్ల రూపాయల పాత నోటీసులకు ఇప్పుడు మోక్షం లభించినట్లయింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం జీఎస్టీని ఎలా లెక్కించాలనే దానిపై ప్రభుత్వం, కంపెనీల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు. ట్యాక్స్ అధికారులు గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో యూజర్లు డిపాజిట్ చేసే మొత్తం ఫేస్ వాల్యూ (మొత్తం డబ్బు) పై 28 శాతం పన్ను కట్టాలని డిమాండ్ చేశారు. కానీ గేమింగ్ కంపెనీలు మాత్రం.. తాము కేవలం టోర్నమెంట్లు నిర్వహించినందుకు తీసుకునే 5 నుంచి 15 శాతం కమీషన్ లేదా గ్రాస్ గేమింగ్ రెవెన్యూ (GGR) పై మాత్రమే పన్ను కడతామని వాదించాయి. ప్రభుత్వం అడిగినంత పన్ను కడితే.. అది తమ కంపెనీల మొత్తం ఆదాయం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల కంపెనీలు మూసివేయాల్సి వస్తుందని మొత్తుకున్నా సుప్రీంకోర్టు మాత్రం ప్రభుత్వ వాదనతోనే ఏకీభవించింది.

జీఎస్టీ చట్టం పరిధిలోకి వచ్చే ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలు యాక్షనబుల్ క్లెయిమ్స్ కిందకే వస్తాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పులో మరో కీలకమైన అంశం ఏంటంటే.. ఆన్‌లైన్ బెట్టింగ్, డబ్బులతో కూడిన ఆటలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిషేధం విధించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. సదరు గేమ్స్ అనేవి స్కిల్‎తో కూడుకున్నవి అయినప్పటికీ, వాటిలో డబ్బుల చేతులు మారితే రాష్ట్రాలు వాటిని కంట్రోల్ చేయవచ్చని తెలిపింది.

ఈ క్రమంలో గతంలో ఆన్‌లైన్ గేమింగ్ నిషేధ చట్టాలను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలాగే గతంలో కర్ణాటక హైకోర్టు గేమింగ్ కంపెనీలకు ఇచ్చిన తాత్కాలిక ఉపశమనాన్ని కూడా రద్దు చేస్తూ.. ట్యాక్స్ అధికారులు చట్టప్రకారం 'షోకాజ్ నోటీసులపై' తదుపరి చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది. అయితే కంపెనీలు ఈ నోటీసులకు చట్టబద్ధంగా సమాధానం ఇచ్చుకునే స్వేచ్ఛను కోర్టు కల్పించింది.

నిజానికి రియల్-మనీ గేమింగ్ (RMG) రంగానికి ఇది వరుసగా తగులుతున్న రెండో పెద్ద దెబ్బ. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాట్‌ఫామ్‌లకు సుమారు రూ. 2.5 లక్షల కోట్ల విలువైన పాత పన్ను నోటీసులు జారీ అవ్వగా.. దీనిపై సుప్రీంకోర్టు ఆగస్టు 2025లోనే తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన రెండు వారాలకే కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ ఆక్ట్ (PROGA) అనే సరికొత్త కఠిన చట్టాన్ని తీసుకువచ్చింది.

ఈ కొత్త ప్రోగా చట్టం ప్రకారం.. వినియోగదారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా డబ్బులు డిపాజిట్ చేసి, తిరిగి గెలుచుకోవచ్చనే ఆశతో ఆడే అన్ని రకాల ఆన్‌లైన్ రియల్-మనీ గేమ్స్‌పై ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది. ఈ చట్టం దేశంలో వేగంగా ఎదుగుతున్న 3.5 బిలియన్ డాలర్ల గేమింగ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. ఆదాయాలు పడిపోవడంతో కంపెనీలు బతుకుదెరువు కోసం భారీగా ఖర్చులను తగ్గించుకున్నాయి. ఈ సంక్షోభం వల్ల గేమింగ్ రంగానికి చెందిన 3,000 మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ కొత్త నిబంధనలు అధికారికంగా 2026 మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story