Swiggy : స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు బిగ్ షాక్.. ఒకేసారి కీలక పదవులకు రాజీనామా చేసిన సీఓఓ, సీబీఓ
రాజీనామా చేసిన సీఓఓ, సీబీఓ

Swiggy : ఆన్‌లైన్ గ్రోసరీ, క్విక్ కామర్స్ రంగంలో నంబర్ వన్ స్థానం కోసం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఈ తరుణంలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కంపెనీలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఒకేసారి తమ పదవులకు గుడ్‌బై చెప్పారు. ఇన్‌స్టామార్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) అంకిత్ జైన్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) హరి కుమార్ కంపెనీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇద్దరు కీలక అధికారులు ఒకేసారి తప్పుకోవడం స్విగ్గీ గ్రూప్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే భావించవచ్చు.
రాజీనామాకు వ్యక్తిగత కారణాలే కారణమా?
కంపెనీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, అంకిత్ జైన్, హరి కుమార్ ఇద్దరూ తమ సొంత వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామాలు సమర్పించినట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ ఈ-కామర్స్ రంగంలో భారీ అనుభవం ఉంది. స్విగ్గీలో చేరడానికి ముందు వీరిద్దరూ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో సుదీర్ఘ కాలం పాటు ఉన్నత పదవుల్లో పనిచేశారు. అక్కడి నుంచి వచ్చిన అనుభవంతోనే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను లాజిస్టిక్స్, బిజినెస్ పరంగా ముందుకు నడిపించారు.
అంకిత్, హరి కుమార్ నిర్వహించిన కీలక బాధ్యతలు
అంకిత్ జైన్ గత ఏడాది మే నెలలో ఇన్‌స్టామార్ట్ సీఓఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఫ్లిప్‌కార్ట్‌లో ఐదేళ్లకు పైగా పనిచేసిన అనుభవజ్ఞుడు. ఇన్‌స్టామార్ట్‌లో డార్క్ స్టోర్ ఆపరేషన్స్, నెట్‌వర్క్ డిజైనింగ్, స్టాక్ ప్లానింగ్, సరుకుల సప్లై చైన్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక హరి కుమార్ నవంబర్ 2024 లో సీబీఓగా ఇన్‌స్టామార్ట్ బృందంలో చేరారు. వీరిద్దరూ ఇన్‌స్టామార్ట్ ప్రస్తుత సీఈఓ అమితేష్ ఝాతో కలిసి పని చేసేవారు. విశేషం ఏమిటంటే సీఈఓ అమిితేష్ కూడా ఫ్లిప్‌కార్ట్ మాజీ సీనియర్ అధికారే కావడం గమనార్హం.
కొత్త నాయకత్వం కోసం స్విగ్గీ అన్వేషణ
టాప్ పొజిషన్లలో ఉన్న ఇద్దరు అధికారులు తప్పుకోవడంతో స్విగ్గీ యాజమాన్యం అలర్ట్ అయింది. ఖాళీ అయిన సీఓఓ, సీబీఓ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన కొత్త వ్యక్తుల కోసం వేట ప్రారంభించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విపరీతమైన డిమాండ్‌ను తట్టుకోవడానికి వీలుగా కార్పొరేట్ రంగంలోని సీనియర్ లీడర్లను ఈ పదవుల్లో నియమించాలని స్విగ్గీ భావిస్తోంది. ఇందుకోసం మేనేజ్‌మెంట్ స్థాయిలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను కూడా వేగవంతం చేసినట్లు సమాచారం.
ఇటీవలే మారిన స్విగ్గీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
స్విగ్గీ సంస్థలో ఇలాంటి పెద్ద మార్పులు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే స్విగ్గీ కో-ఫౌండర్, ఇన్నోవేషన్ హెడ్ అయిన నందన్ రెడ్డి కంపెనీ బోర్డు డైరెక్టర్ల పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కంపెనీ తన మరో కో-ఫౌండర్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఫణి కిషన్ అద్దేపల్లితో పాటు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) రాహుల్ బోత్రాను బోర్డులోకి తీసుకువచ్చింది. ఈ బోర్డు మార్పుల వేడి చల్లారకముందే ఇన్‌స్టామార్ట్ బిజినెస్ వింగ్స్ దెబ్బతినడం గమనార్హం.
ముదురుతున్న క్విక్ కామర్స్ మార్కెట్ యుద్ధం
ప్రస్తుతం భారతదేశంలో క్విక్ కామర్స్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్లకు చేరింది. ఆర్డర్ల వాల్యూమ్, మార్కెట్ వాటా పరంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ రేసులో జొమాటోకు చెందిన బ్లింకిట్ మొదటి స్థానంలో, జెప్టో రెండో స్థానంలో ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. వీటికి తోడు అమెజాన్ ఇండియా అమెజాన్ నౌ పేరుతో, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ పేరుతో ఈ రంగంలోకి వేగంగా దూసుకువస్తుండటంతో పోటీ మరింత తీవ్రమైంది. ఈ క్లిష్ట సమయంలో ఇన్‌స్టామార్ట్ కొత్త లీడర్‌షిప్ ఎలాంటి వ్యూహాలతో వస్తుందో చూడాలి.

