Swiggy Zomato Fight : స్విగ్గీ, జొమాటో మధ్య రూ.200 థాలీ ఫైట్.. ఇకపై ప్రతిరోజూ ఆఫీస్‌లోనే చీప్ అండ్ బెస్ట్ లంచ్
ఆఫీస్‌లోనే చీప్ అండ్ బెస్ట్ లంచ్

Swiggy Zomato Fight : రోజువారీ ఆఫీస్ పని ఒత్తిడిలో చాలామంది మధ్యాహ్నం లంచ్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలని అనుకుంటారు. కానీ తీరా యాప్స్ ఓపెన్ చేసి చూస్తే కనీసం రూ.400 నుంచి రూ.500 దాటే బిల్లులు చూసి వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇలాంటి బడ్జెట్ కస్టమర్ల టెన్షన్లకు గుడ్ న్యూస్ చెబుతూ దేశీయ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు స్విగ్గీ, జొమాటో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టాయి. కేవలం రూ.200 బడ్జెట్‌లోనే కడుపు నిండేలా వాల్యూ మీల్స్ అందించడంపై ఈ కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేయడాన్ని కేవలం పండుగలు, పార్టీలు లేదా ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయకుండా.. సామాన్యుల రోజువారీ అలవాటుగా మార్చడమే ఈ కొత్త ప్రయోగాల వెనుక ఉన్న అసలు లక్ష్యం.
కస్టమర్ల రోజువారీ లంచ్‌పై కన్నేసిన డెలివరీ కంపెనీలు
ప్రస్తుతం మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. కేవలం అప్పుడప్పుడు ఆర్డర్ చేసే కస్టమర్ల కంటే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆఫీస్ లంచ్ ఆర్డర్ చేసే కస్టమర్లను తమ వైపు తిప్పుకోవడం పైనే ఈ కంపెనీల భవిష్యత్తు ఆధారపడి ఉంది. డెలివరీ ఛార్జీలు, జీఎస్టీ వంటి పన్నులన్నీ కలుపుకుని కస్టమర్ చెల్లించే ఫైనల్ బిల్లు రూ.200 నుంచి రూ.250 లోపే ఉండాలని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఆఫీస్ పక్కనే ఉండే చిన్న చిన్న హోటళ్లు లేదా డబ్బాల రేట్లకు సరిసమానంగా ఆన్‌లైన్ ఫుడ్ ధరలు లభిస్తేనే యువ ఉద్యోగులు ఆన్‌లైన్ వైపు మొగ్గు చూపుతారు. ఈ భారీ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్‌లు సైతం తమ మెనూలో తక్కువ ధరలకే లభించే కాంబోలను జోడిస్తున్నాయి.
ఢీ అంటే ఢీ అంటున్న స్విగ్గీ, జొమాటో
తక్కువ బడ్జెట్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి స్విగ్గీ తన మెయిన్ యాప్‌లోనే వాల్యూ స్టోర్ అనే ప్రత్యేక విభాగాన్ని ప్రవేశపెట్టింది. దీనితో పాటు మితమైన ధరల్లో ఆహారాన్ని అందించేందుకు టోయింగ్ అనే సరికొత్త సపరేట్ యాప్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. భారీ ధరల ఆర్డర్ల కంటే బడ్జెట్ ధరల ఆహారంతోనే భవిష్యత్తు వ్యాపార వృద్ధి సాధ్యమని స్విగ్గీ భావిస్తోంది. మరోవైపు, జొమాటో ఎలాంటి ప్రత్యేక చీప్ యాప్ తీసుకురావడానికి ఇష్టపడటం లేదు. సపరేట్ యాప్‌ల కంటే అధిక డిమాండ్ ఉన్న ఏరియాలలో నేరుగా రెస్టారెంట్లతో మాట్లాడి ప్రత్యేక డిస్కౌంట్లు అందించడమే మేలని జొమాటో నమ్ముతోంది. అలాగే కస్టమర్ల డిమాండ్‌కు తగ్గట్లు జొమాటో ‘బిస్ట్రో’ మోడల్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది.
కమిషన్ లేని కొత్త యాప్‌లు.. బహుళ బ్రాండ్ల వ్యూహాలు
డెలివరీ మార్కెట్లోకి కొత్త శక్తులు కూడా సరికొత్త ప్రయోగాలతో ప్రవేశిస్తున్నాయి. ప్రయాణ సేవల సంస్థ రేపిడో మద్దతుతో నడుస్తున్న ఓన్లీ అనే యాప్ సరికొత్త బిజినెస్ మోడల్‌తో ముందుకొచ్చింది. ఈ సంస్థ రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయదు. దీనివల్ల రెస్టారెంట్లు తమ ఆహారాన్ని చాలా తక్కువ ధరకు నేరుగా కస్టమర్లకు అందించే వీలుంటుంది. ఇందులో కస్టమర్ కేవలం ఫుడ్ ఛార్జీలు, డెలివరీ ఛార్జీలను విడివిడిగా చెల్లిస్తే సరిపోతుంది. మరోవైపు క్లౌడ్ కిచెన్ దిగ్గజం రిబెల్ ఫుడ్స్, క్యూర్ ఫుడ్స్ వంటి సంస్థలు కేవలం తక్కువ ధరలే కాకుండా.. కస్టమర్ల మూడ్స్, టేస్ట్స్, బడ్జెట్‌కు తగినట్లు ఈట్‌ఫిట్, కేక్‌జోన్ వంటి భిన్నమైన బ్రాండ్ల ద్వారా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
రూ. 2.2 లక్షల కోట్లకు చేరనున్న ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్
ఇన్వెస్ట్ ఈక్విటీస్ నివేదికల ప్రకారం.. భారతదేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. కేవలం పెద్ద నగరాల నుంచే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా ఆర్డర్లు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఉన్న మార్కెట్ విలువతో పోలిస్తే, రాబోయే 2030 నాటికి దేశీయ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ ఏకంగా 27 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.2 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మారుతున్న జీవనశైలి, వేగవంతమైన పట్టణీకరణ కారణంగా ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ ఆహారానికి అలవాటు పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.

