Tata SP Group Deal : భారతదేశ కార్పొరేట్ ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దిగ్గజాలైన టాటా గ్రూప్, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న వాటాల వివాదం ఒక ముగింపునకు వచ్చేలా కనిపిస్తోంది. టాటా సన్స్‌లో ఎస్పీ గ్రూప్‌నకు ఉన్న 18.4 శాతం వాటాను ఎలా సెటిల్ చేయాలనే దానిపై ఇరు వర్గాల మధ్య సరికొత్త చర్చలు ఊపందుకున్నాయి. ఈ వాటాల విలువను లెక్కగట్టే విషయంలో ఇరు గ్రూపుల మధ్య భారీ అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి షేర్ స్వాప్ అనే చారిత్రాత్మక ఫార్ములాపై ఇరుపక్షాలు సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

నోయల్ టాటా, షాపూర్ మిస్త్రీల మధ్య కీలక భేటీ

ఈ వివాద పరిష్కారం కోసం టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా, ఎస్పీ గ్రూప్ చైర్మన్ షాపూర్ మిస్త్రీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మధ్య ఇప్పటికే మొదటి రౌండ్ చర్చలు జరిగాయి. ఈ డీల్ కోసం టాటా సన్స్ ఎలాంటి అదనపు అప్పులు చేయకూడదనే నిబంధనకు నోయల్ టాటా మొగ్గు చూపారు. ఆ తర్వాత టాటా ట్రస్ట్స్ కన్సల్టెంట్ ఫారోఖ్ సుబేదార్ లాంటి కీలక వ్యక్తులు కూడా రంగంలోకి దిగారు. అయితే ప్రస్తుతం అన్‌లిస్టెడ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్ వాటాల విలువను, అలాగే మార్పిడికి ఉపయోగించే టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువను ఖరారు చేసే విషయంలో ఇరు పక్షాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డీల్ స్ట్రక్చర్ వాల్యుయేషన్ దగ్గరే నిలిచిపోయింది.

రూ.25 లక్షల కోట్ల సామ్రాజ్యం

టాటా గ్రూప్‌నకు చెందిన 16 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.25.28 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో కేవలం టాటా సన్స్ వాటా విలువే రూ.11.9 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత పెద్ద మొత్తాన్ని సెటిల్ చేయడానికి టాటా సంస్థ అప్పు తీసుకోనని చెప్పడం ఆచరణ సాధ్యం కాదని ఎస్పీ గ్రూప్ భావిస్తోంది. అందుకే టాటా సన్స్ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడమే వాటాల విలువను రాబట్టడానికి సరైన మార్గమని మిస్త్రీ కుటుంబం వాదిస్తోంది. కానీ, నోయల్ టాటా మాత్రం టాటా సన్స్ లిస్టింగ్‌కు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బంధుత్వాల రీత్యా ఈ వ్యవహారంలో నోయల్ టాటా ప్రమేయంపై టాటా ట్రస్ట్‌లో అంతర్గత చర్చలు నడుస్తున్నప్పటికీ, 66 శాతం వాటా ఉన్న ట్రస్ట్ చైర్మన్‌గా ఆయన నిర్ణయమే ఇక్కడ కీలకం కానుంది.

రూ.21,500 కోట్ల భారీ ఫండింగ్

మరోవైపు ఎస్పీ గ్రూప్ తనకున్న భారీ అప్పులను తగ్గించుకోవడానికి వేగంగా పావులు కదుపుతోంది. తన రీఫైనాన్సింగ్ ప్లాన్‌లో భాగంగా దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ద్వారా ఏకంగా రూ.21,500 కోట్ల నిధుల సమీకరణకు కట్టుబాట్లు సాధించింది. ఈ నిధుల సేకరణలో 18.95 శాతం వడ్డీ రేటుతో రూ.15,200 కోట్ల విలువైన మూడేళ్ల రూపీ బాండ్లు, అలాగే 14.5 శాతం వడ్డీతో కూడిన సుమారు 650 మిలియన్ డాలర్ల విలువైన డాలర్ బాండ్లు ఉన్నాయి. ఈ మొత్తం డీల్ జులై 20 నాటికి పూర్తి కానుంది. ఈ భారీ నిధుల సహాయంతో ఎస్పీ గ్రూప్ తనకున్న పాత, ఖరీదైన అప్పులను తీర్చివేసి లాంగ్ టర్మ్ ఫండింగ్‌లోకి మారాలని చూస్తోంది.

మరో 18 నెలల్లోనే తేలిపోవాలి

ఎస్పీ గ్రూప్ తన అనుబంధ సంస్థ ఇక్విజెన్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఈ నిధులను సేకరిస్తోంది. అయితే ఇన్వెస్టర్లు ఇంత భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి ప్రధాన కారణం టాటా సన్స్‌లో ఎస్పీ గ్రూప్‌నకు ఉన్న 18.37 శాతం వాటా షేర్లను పూచీకత్తుగా పెట్టడమే. ఈ బాండ్లు జారీ చేసిన 18 నెలల లోపు ఒక కీలకమైన షరతు నెరవేరాల్సి ఉంటుంది. ఆ గడువు లోపు టాటా సన్స్ ఐపీఓ ప్రకటన అయినా రావాలి, లేదా టాటా సన్స్, ఎస్పీ గ్రూప్ మధ్య వాటాల కొనుగోలుకు సంబంధించి ఏదైనా థర్డ్ పార్టీ కొనుగోలుదారుడితో అధికారిక ఒప్పందమైనా జరగాలి. ఈ 18 నెలల డెడ్‌లైన్ ముగిసేలోపు భారత కార్పొరేట్ హిస్టరీలోనే అతిపెద్ద డీల్ ఒకటి క్లియర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story