iPhone : ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ సర్వీస్ వ్యాపారాన్నీ దక్కించుకున్న టాటా కంపెనీ!
రిపేర్ సర్వీస్ వ్యాపారాన్నీ దక్కించుకున్న టాటా కంపెనీ!

iPhone : టాటా గ్రూప్, యాపిల్ కంపెనీల మధ్య వ్యాపార సంబంధాలు రోజురోజుకూ పటిష్టమవుతున్నాయి. యాపిల్ కంపెనీ కోసం భారతదేశంలో ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్న టాటా సంస్థ, ఇప్పుడు ఐఫోన్ మరమ్మత్తు (రిపేరింగ్) వ్యాపారాన్ని కూడా పొందింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్, మ్యాక్‌బుక్ పరికరాల ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ (After-Sales Service) పనులను ఇకపై టాటా కంపెనీనే నిర్వహించనుంది.
భారతదేశంలో ఐఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతుండటం, భవిష్యత్తులో అవి మరింత పెరిగే అవకాశం ఉండటంతో టాటాకు ఈ సర్వీస్ ఒక పెద్ద వ్యాపారంగా మారనుంది. అంతేకాకుండా, యాపిల్ కంపెనీకి టాటా సంస్థ ఒక ప్రధాన సరఫరాదారుల (Key Supplier) జాబితాలో చేరనుంది.
తైవాన్ కేంద్రంగా పనిచేసే విస్ట్రాన్ సంస్థ ఐసిటి సర్వీస్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ (ICT Service Management Solutions) విభాగం ఐఫోన్ల ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ పనులను చేసేది. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని టాటా సంస్థ కొనుగోలు చేసింది. కర్ణాటకలోని కోలార్‌లోని నరసాపురంలో ఉన్న ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లోనే ఈ రిపేర్ సర్వీస్ కూడా జరుగుతుంది.
కోలార్‌లోని నరసాపురంలో ప్రస్తుతం టాటా కంపెనీకి చెందిన ఐఫోన్ యూనిట్ ఉంది. ఇది గతంలో విస్ట్రాన్‌కు చెందినది. యాపిల్ ప్రధాన సరఫరాదారులలో విస్ట్రాన్ కూడా ఒకటి. అయితే, భారతదేశంలో తన ఐఫోన్ అసెంబ్లింగ్ వ్యాపారాన్ని టాటా కంపెనీకి విక్రయించింది. ఈ యూనిట్‌తో సహా భారతదేశంలో టాటా కంపెనీకి ప్రస్తుతం మూడు ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. ఈ మూడు యూనిట్లలో ఒక దానిలో ఐఫోన్ల విడిభాగాలను తయారు చేసే పనిని టాటా నిర్వహిస్తుంది.
మరోవైపు, విస్ట్రాన్ సంస్థ ఇతర క్లయింట్లకు ఆఫ్టర్-సేల్స్ సర్వీస్‌లను అందించడం కొనసాగించనుంది. అయితే, భారతదేశంలో యాపిల్ కంపెనీతో విస్ట్రాన్ బంధం దాదాపుగా ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. యాపిల్ తన ఉత్పత్తి, సర్వీసు సప్లై చైన్ భారతదేశంలో మరింత బలోపేతం చేసుకోవడానికి, అలాగే చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి టాటాతో ఈ భాగస్వామ్యాన్ని విస్తరిస్తోంది. ఇది 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి కూడా మరింత ఊతం ఇవ్వనుంది.
