Tata Group : 3 నెలల్లో కోట్లు.. టీ, ఉప్పు, కాఫీ వ్యాపారంలో అదరగొట్టిన టాటా గ్రూప్!
టీ, ఉప్పు, కాఫీ వ్యాపారంలో అదరగొట్టిన టాటా గ్రూప్!

Tata Group : దేశంలోనే పెద్ద వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూప్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్-జూన్) టీ, ఉప్పు, కాఫీ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయల లాభాలు గడించింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల ప్రకారం.. కంపెనీ లాభాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15 శాతం పెరిగి రూ.334 కోట్లకు చేరాయి. అలాగే, మొత్తం ఆదాయం కూడా 10 శాతం పెరిగి రూ.4,778.91 కోట్లుగా నమోదైంది.
టాటా కన్స్యూమర్ నికర లాభం గతేడాది రూ.290 కోట్ల నుంచి రూ.334 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా రూ.4,352 కోట్ల నుంచి రూ.4,778.91 కోట్లకు చేరింది. భారతదేశంలో వ్యాపారం 11% వృద్ధి సాధించగా, అంతర్జాతీయంగా 6% వృద్ధి కనిపించింది. అనుబంధ కంపెనీల నుండి వచ్చిన రూ.464 కోట్ల డివిడెండ్ ఆదాయం వల్ల స్టాండ్‌అలోన్ లాభం రూ.714 కోట్లకు పెరిగింది.
అయితే, టీ ధరలు పెరగడం, బ్రాండెడ్ కాని కాఫీ ధరలు తగ్గడం వల్ల కంపెనీకి వ్యయ భారం పెరిగింది. దీని వల్ల ఎబిటా 8 శాతం తగ్గి రూ.615 కోట్లకు చేరింది. టాటా టీ, టాటా కాఫీ వంటి బ్రాండెడ్ ఉత్పత్తుల పనితీరుపై కూడా ఈ ఖర్చుల ప్రభావం పడింది. భారతీయ వ్యాపారం లాభం 10% తగ్గగా, అంతర్జాతీయ లాభం 11% తగ్గింది. దేశంలోనే అతిపెద్ద టీ బ్రాండ్ అయిన టాటా టీ మార్కెట్ వాటా 80 బేసిస్ పాయింట్లు తగ్గినా, భవిష్యత్తుపై ఆశాభావంతో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
టీ, ఉప్పు విభాగాల్లో బలమైన వృద్ధి నమోదైందని కంపెనీ తెలిపింది. టాటా సంపన్ కూడా మంచి పనితీరు కనబరిచింది. అయితే, రెడీ-టు-డ్రింక్ వ్యాపారం అకాల వర్షాల వల్ల కొంచెం నెమ్మదించింది. అంతర్జాతీయ వ్యాపారంలో 5% ఆదాయ వృద్ధి కనిపించగా, భారతదేశంలో ప్యాకేజ్డ్ బెవరేజ్ వ్యాపారం 12% వృద్ధిని, కాఫీ విభాగం 67% బలమైన వృద్ధిని సాధించాయి.
