Tata Sons IPO : టాటా ఐపీఓ ఆశలపై నీళ్లు.. కీలక బోర్డు మీటింగ్ వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే?
కీలక బోర్డు మీటింగ్ వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే?

Tata Sons IPO : టాటా గ్రూప్ ఐపీఓ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు మరోసారి నిరాశే ఎదురైంది. టాటా సన్స్ లిస్టింగ్‌పై నేడు (మే 8న) జరగాల్సిన అత్యంత కీలకమైన టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశం వాయిదా పడింది. కొన్ని చట్టపరమైన చిక్కులు, అంతర్గత కారణాల వల్ల ఈ భేటీని మే 16వ తేదీకి మార్చినట్లు సమాచారం. దీంతో టాటా గ్రూప్ ఐపీఓపై నెలకొన్న ఉత్కంఠ మరికొన్ని రోజులు కొనసాగనుంది.
టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీకి సంబంధించిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ బోర్డు సభ్యులు నేడు భేటీ కావాల్సి ఉంది. ముందుగా ఈ సమావేశాన్ని మే 12న నిర్వహించాలని అనుకున్నప్పటికీ, తర్వాత దానిని మే 8కి (నేటికి) మార్చారు. కానీ తాజాగా ఈ భేటీని మే 16వ తేదీకి వాయిదా వేయడం గమనార్హం. టాటా సంస్ బోర్డులో ట్రస్టుల ప్రాతినిధ్యం, కొత్త డైరెక్టర్ల నియామకం, ఐపీఓపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఈ వాయిదా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రూప్‌లో ఉన్న కొన్ని చట్టపరమైన అంశాలను పరిష్కరించుకోవడానికే ఈ సమయం తీసుకుంటున్నట్లు సమాచారం.
టాటా ట్రస్ట్స్ వైస్ ఛైర్మన్లు విజయ్ సింగ్, వేణు శ్రీనివాసన్ గతంలో ఐపీఓకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. అయితే, గ్రూప్ ఛైర్మన్ నోయల్ టాటా నాయకత్వంలోని మెజారిటీ సభ్యులు మాత్రం కంపెనీని ప్రైవేట్‌గానే ఉంచాలని పట్టుబడుతున్నారు. ఈ ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే సమావేశం వరుసగా వాయిదా పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మే 16న జరిగే సమావేశంలోనైనా ఈ ప్రతిష్టంభన తొలగుతుందో లేదో చూడాలి.
టాటా సంస్ ఐపీఓ వస్తే అది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్దది అవుతుందని అంచనా. ఇప్పటికే టాటా గ్రూప్ షేర్లన్నీ ఈ వార్తలతో లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ వంటి కంపెనీలు ఐపీఓ వార్తలపైనే ఆధారపడి ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు మీటింగ్ వాయిదా పడటంతో ఈ షేర్లలో స్వల్ప ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2026 నాటికి టాటా సంస్ లిస్ట్ అవ్వాల్సి ఉన్నప్పటికీ, దీనిని తప్పించుకోవడానికి టాటా గ్రూప్ ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

