Tata Group: కార్పొరేట్ ప్రపంచంలో కలకలం రేపుతున్న టాటా వివాదం.. అసలు ఏం జరుగుతోంది?
అసలు ఏం జరుగుతోంది?

Tata Group: భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్‌లో బోర్డు రూమ్ రాజకీయం ఒక్కసారిగా రచ్చకెక్కింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదు సంవత్సరాల పాటు రీ అపాయింట్ మెంట్ చేయడంపై తీవ్రమైన వివాదం చెలరేగింది. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ అయిన నోయల్ టాటా ఈ బోర్డు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా చంద్రశేఖరన్ నియామకం కోసం జరిగిన ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా అక్రమం, చెల్లనిది అని ఆయన కొట్టిపారేశారు. ఇది కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలకు విరుద్ధమని, స్పష్టమైన విశ్వాసద్రోహం అని ఆరోపిస్తూ నోయల్ టాటా నేరుగా బోర్డు మెంబర్లకు ఒక కఠినమైన లేఖ రాయడం సంచలనం సృష్టించింది.
సెప్టెంబర్ 17న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ రీ అపాయింట్మెంట్ ఐపీఓ సన్నాహాలకు సంబంధించి కొన్ని కండిషన్లపై ఓటింగ్ జరిగింది. ఈ సమావేశంలో 4-1 మెజారిటీతో చంద్రశేఖరన్ మళ్లీ ఛైర్మన్‌గా ఎంపికైనట్లు ప్రకటించారు. అయితే, ఈ ఓటింగ్ కొన్ని ప్రత్యేక షరతుల ఆధారంగా జరిగిందని, కానీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని పబ్లిక్‌గా ప్రకటించేటప్పుడు ఆ షరతులను పూర్తిగా విస్మరించారని నోయల్ టాటా ఆరోపించారు. కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోషియేషన్ నిబంధనలను పాటించాలని, ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా వాటాదారుల ఆమోదం పొందాలని, అప్పటివరకు ఈ విషయాన్ని బయటపెట్టకూడదని ఒప్పందం కుదిరినా, దానిని ఉల్లంఘించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదం వెనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలు కూడా ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. టాటా సన్స్ తన కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను సరెండర్ చేయాలన్న అభ్యర్థనను ఆర్‌బీఐ తిరస్కరించడంతో, కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కావాల్సిన నిబంధనలను పాటించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ మధ్య బోర్డు నిర్ణయాలు, నియమ నిబంధనల వ్యాఖ్యానంపై తీవ్రమైన అభిప్రాయ భేదాలు తలెత్తాయి. డైరెక్టర్ల మధ్యే భిన్నాభిప్రాయాలు వచ్చి క్యాస్టింగ్ ఓట్ వరకు వెళ్లడం టాటా చరిత్రలో అత్యంత అరుదైన పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నోయల్ టాటా రాసిన లేఖ కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. బోర్డు తీసుకున్న నిర్ణయంపై పబ్లిక్‌గా తప్పును సరిదిద్దాలని, లేఖలో పేర్కొన్న షరతులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టాటా గ్రూప్ వంటి అత్యున్నత విలువలు కలిగిన సంస్థలో ఇలాంటి అంతర్గత విభేదాలు బయటపడటంతో మార్కెట్ వర్గాల దృష్టి పూర్తిగా ఈ వివాదంపైనే కేంద్రీకృతమైంది. ఈ ఉద్రిక్తతల నడుమ టాటా సన్స్ బోర్డు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ప్రస్తుతం తీవ్ర ఆసక్తికరంగా మారింది.

