Tata: టాటా గ్రూప్‌లో భారీ కుదుపు.. బోర్డు రూమ్ నుంచి కోర్టులకెక్కుతున్న వివాదం
వివాదం

Tata: దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌లో మరోసారి తీవ్రమైన అంతర్గత కలహాలు బయటపడ్డాయి. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్‌ను మళ్లీ నియమించడంపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. నోయెల్ టాటా నేతృత్వంలోని టాటా ట్రస్ట్స్ ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకంగా న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. ఈ వివాదం కేవలం ఒక పదవికి సంబంధించినది మాత్రమే కాకుండా, టాటా ట్రస్ట్స్ అధికారాలు, హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న పెద్ద యుద్ధంగా మారుతోంది. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నోయెల్ టాటా లేఖ, బోర్డు మీటింగ్ వివాదం
ఇటీవల జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. మెజారిటీ సభ్యులు చంద్రశేఖరన్ పునర్నియామకానికి, అలాగే కంపెనీని షేర్ మార్కెట్లో లిస్ట్ చేయడానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ అయిన నోయెల్ టాటా ఈ నిర్ణయాలను మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీ కార్యదర్శికి నోయెల్ టాటా ఒక లేఖ రాస్తూ చైర్మన్ రీ అపాయింట్మెంట్ ప్రక్రియ చట్టవిరుద్ధమని, అది మొదటి నుంచీ చెల్లనేరదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జరిగిన విషయాలపై బహిరంగంగా స్పష్టత ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దీనికి టాటా సన్స్ నుంచి అధికారిక స్పందన రాకపోవడంతో, ట్రస్ట్స్ నేరుగా ఎన్‌సీఎల్‌టీ లేదా బాంబే హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోంది.
ట్రస్టీల మధ్య భేదాభిప్రాయాలు
ఈ కోర్టు వివాదాలకు భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉండటంతో, టాటా ట్రస్ట్స్‌లోని కీలక సభ్యుల మధ్య కూడా భేదాభిప్రాయాలు తలెత్తినట్లు సమాచారం. ఈ లీగల్ ఖర్చుల కోసం ట్రస్ట్స్ నిధులను ఉపయోగించడంపై విజయ్ సింగ్,వేణు శ్రీనివాసన్ అనే ఇద్దరు ప్రముఖ ట్రస్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఏకాభిప్రాయం లేకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం కంటే, ప్రతి అంశాన్ని విడిగా పరిశీలించాలని వారు కోరుతున్నారు. మరోవైపు, ఈ వివాదంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బాంబే హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. టాటా ట్రస్ట్స్ ఏదైనా ఊరట కోరితే తన వాదనలను కూడా వినాలని ఆర్‌బీఐ కోరడం ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చింది.
టాటా వంద ఏళ్ల బంధం తెగే ప్రమాదమా?
టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ మధ్య గత వంద సంవత్సరాలకు పైగా బలమైన, విడదీయరాని అనుబంధం ఉంది. ప్రముఖ సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, హరీష్ సాల్నే వంటి దిగ్గజాలు ఈ వివాదంపై తమ వాదనలను వినిపిస్తున్నారు. ట్రస్ట్స్ ప్రత్యేక అధికారాలు, వీటో పవర్, వాటాదారుల హక్కులను కాలవూయలేమని సింఘ్వీ వాదిస్తుండగా, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పబ్లిక్ కంపెనీగా మారాల్సిన అవసరాన్ని సాల్నే సమర్థిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, దేశంలోని అత్యున్నత వ్యాపార కుటుంబంలో బోర్డు రూమ్ నుంచి ప్రారంభమైన ఈ విభేదాలు ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితికి రావడంతో టాటా గ్రూప్ భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

