UPI : యూపీఐ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇక పై పేమెంట్ చేస్తే ఛార్జీలు పడే ఛాన్స్
ఛార్జీలు పడే ఛాన్స్

UPI : భారతదేశంలో చిన్న టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు డిజిటల్ చెల్లింపులు సాధారణమైపోయాయి. రూపాయి క్యాష్ లేకపోయినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో లావాదేవీలు పూర్తి చేస్తున్నాము. అయితే ఈ ఫ్రీ డిజిటల్ పేమెంట్స్ యుగానికి త్వరలోనే ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే సామాన్య ప్రజల జేబులపై, విదేశీ పెట్టుబడులపై, దేశంలో వ్యాపార నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
ఫ్రీ యూపీఐ సేవలకు ముగింపు పడనుందా?
ఇప్పటివరకు మనం రూపాయి కూడా అదనపు ఛార్జీలు లేకుండా యూపీఐ లావాదేవీలు చేయడానికి ప్రధాన కారణం పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10A. ఈ నిబంధన ప్రకారం బ్యాంకులు లేదా డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు పేరుతో వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయడానికి వీల్లేదు. అయితే ఈ నూతన బిల్లులో సదరు జీరో-ఎమ్‌డిఆర్ నిబంధనను తొలగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. డిజిటల్ పేమెంట్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి, సాంకేతికంగా విస్తరించడానికి నిధుల అవసరం ఉందని, అందుకే భవిష్యత్తులో లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులు, పేమెంట్ కంపెనీలకు అనుమతినిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
విదేశీ పెట్టుబడిదారులకు పన్నుల నుంచి లభించనున్న ఊరట
దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ బిల్లులో భారీ పన్ను మినహాయింపులను పొందుపరిచారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడితే, వారి వడ్డీ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్‌పై ఎలాంటి పన్ను విధించరు. దీనితో పాటు బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ పెట్టుబడులకు కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. దేశంలో ఫండ్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలను సులభతరం చేసేందుకు పన్ను విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చనున్నారు.
ఎలక్ట్రానిక్స్ తయారీ, డేటా సెంటర్లకు బూస్ట్
భారత్‌ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మార్చేందుకు ఈ బిల్లులో ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, సర్వర్లు మరియు స్మార్ట్ వేరబుల్స్ వంటి పరికరాలను స్పెసిఫైడ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కేటగిరీలో చేర్చారు. వీటి కాంట్రాక్ట్ తయారీ చేపట్టే కంపెనీలకు ఆర్థిక సంవత్సరం 2041 వరకు పన్ను మినహాయింపులు పొడిగించారు. అలాగే, కస్టమ్స్ బాండెడ్ వేర్‌హౌస్‌లలో విడిభాగాలను ఉంచే విదేశీ కంపెనీలకు కూడా 2041 వరకు పన్ను ఉపశమనం లభిస్తుంది. లీజ్డ్ డేటా సెంటర్లు నడిపే భారతీయ కంపెనీలకు సైతం పన్ను నిబంధనలను సులభతరం చేశారు.
డైమండ్ వ్యాపారం, కార్పొరేట్ పన్నుల్లో సవరణలు
డైమండ్ పరిశ్రమను ప్రపంచ స్థాయిలో బలోపేతం చేయడానికి, విదేశీ మైనింగ్ కంపెనీలు, బ్రోకర్లు రఫ్ డైమండ్స్ విక్రయించడంపై ఇచ్చే పన్ను మినహాయింపును 2041 మార్చి 31 వరకు పొడిగించారు. అయితే, నూతన పన్ను విధానాన్ని ఎంచుకునే స్పెషల్ పర్పస్ వెహికల్స్ పై విధించే సర్‌ఛార్జీని 10 శాతం నుంచి ఏకంగా 25 శాతానికి పెంచారు. సాధారణ దేశీయ కంపెనీలకు మాత్రం ఈ సర్‌ఛార్జీ మునుపటిలాగే 10 శాతంగానే కొనసాగుతుంది.

