Tax Reforms : విదేశీ ఇన్వెస్టర్లు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు కేంద్రం బంపర్ ఆఫర్
కేంద్రం బంపర్ ఆఫర్

Tax Reforms : దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి, దేశీయంగా ఉత్పత్తుల తయారీని పెంచడానికి, విదేశీ నిధులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇందుకోసం టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026ని లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. పన్ను వ్యవస్థను సులభతరం చేయడం, పన్ను వివాదాలు తగ్గించడం, తద్వారా భారత్‌ను గ్లోబల్ సప్లై చైన్ హబ్‌గా మార్చడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
ఎలక్ట్రానిక్స్ తయారీపై పన్ను మినహాయింపులు
ఈ నూతన బిల్లు ప్రకారం.. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా ప్రత్యేక ఎలక్ట్రానిక్ వస్తువులను తయారుచేసే కంపెనీలకు పన్ను మినహాయింపులను ఏకంగా 2040-41 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించనున్నారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, సర్వర్లు, వేరబుల్ డివైజ్‌లు, వాటి విడిభాగాలను తయారుచేసే సంస్థలు ఈ మినహాయింపుల పరిధిలోకి వస్తాయి. అంతేకాకుండా బాండెడ్ వేర్‌హౌస్‌లలో ఎలక్ట్రానిక్ పార్ట్‌లను నిల్వ చేసే విదేశీ కంపెనీలకు కూడా పన్ను ఉపశమనం లభించనుంది. దీనివల్ల గ్లోబల్ టెక్ దిగ్గజాలు భారత్‌లోనే యూనిట్లు స్థాపించేందుకు ఆసక్తి చూపుతాయి.
విదేశీ ఫండ్లు, డేటా సెంటర్లు, యూపీఐలకు ఊరట
గ్లోబల్ ఫండ్ మేనేజర్లు: విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్లకు ఉన్న కఠినమైన నిబంధనలను సడలిస్తున్నారు. ఇన్వెస్టర్ల సంఖ్య, కనీస నిధులు, పెట్టుబడుల వైవిధ్యత పై ఉన్న పరిమితులను సడలించి FPIల రాకను వేగవంతం చేయనున్నారు.
ప్రభుత్వ సెక్యూరిటీలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్ల నుంచి పొందే వడ్డీ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపులు ప్రతిపాదించారు.
రియల్ ఎస్టేట్ & డేటా సెంటర్లు: REITs, InvITs ల డివిడెండ్ ఆదాయంపై టాక్స్ ఎగ్జెమ్షన్‌ను పునరుద్ధరించడంతో పాటు, లీజుకు తీసుకున్న డేటా సెంటర్లను నడిపే భారతీయ కంపెనీలకు, విదేశీ ఖాతాదారులకు టాక్స్ రిలీఫ్ ఇవ్వనున్నారు.
యుపిఐ ప్రాసెసింగ్: జీరో ఛార్జ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్‌లను (UPI వంటివి) ఇన్కమ్ టాక్స్ యాక్ట్ ప్రత్యేక నిబంధనల నుంచి మినహాయించి, పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ కింద నోటిఫై చేసే అధికారాన్ని కేంద్రానికి ఇస్తున్నారు.
ఆర్థిక పురోగతికి మైలురాయి నిలవనున్న సంస్కరణలు
ఈ సవరణలు అమలులోకి వస్తే విదేశీ పెట్టుబడిదారులలో నమ్మకం పెరగడమే కాకుండా, దేశీయ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా తయారవుతుంది. రాబోయే కాలంలో గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులను తట్టుకొని స్థిరమైన ప్రగతి సాధించడానికి, బిజినెస్ చేయడం మరింత సులభతరం చేయడానికి ఈ పన్ను సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

