Tax : ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లపై ప్రశంసల కురుస్తోంది.

Tax : ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్లపై ప్రశంసల కురుస్తోంది. బీసీసీఐ ఏకంగా జట్టు కోసం రూ.51 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. గతంతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు ఇప్పుడు అత్యధిక స్థాయిలో పారితోషికం లభిస్తోంది. అయితే ఈ భారీ మొత్తమంతా ఆటగాళ్లకు పూర్తిగా చేరుతుందా? లేక ఆదాయపు పన్ను, జీఎస్టీ రూపంలో కొంత కోత పడుతుందా? క్రికెటర్ల ఆదాయానికి సంబంధించి పన్ను నిబంధనలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.


క్రికెట్ ఆడే క్రీడాకారులు, క్రీడాకారిణులకు మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టులు, నగదు బహుమతుల రూపంలో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంపై భారతీయ ఆదాయపు పన్ను నిబంధనలు వర్తిస్తాయి. క్రీడాకారులకు వచ్చే ఆదాయంపై వార్షికంగా వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను లెక్కింపు జరుగుతుంది. బీసీసీఐ లేదా ఐపీఎల్ వంటి సంస్థలు మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టులు చెల్లించేటప్పుడే 10% నుంచి 30% వరకు టీడీఎస్‎ను మినహాయించుకుంటాయి. ఐపీఎల్‌లో ఆడే విదేశీ క్రీడాకారులకైతే 20% టీడీఎస్‌ను మినహాయిస్తారు. అంతేకాకుండా, మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల వంటి సేవల ద్వారా వచ్చే ఆదాయానికి 18% జీఎస్టీ కూడా వర్తిస్తుంది. అయితే, ప్రపంచకప్ బహుమతి వంటి నగదు పురస్కారాలకు జీఎస్టీ వర్తించదు.


చివరగా క్రీడాకారులు తమ వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్‌‎ను దాఖలు చేసే సమయంలో ఇప్పటికే కట్ అయిన టీడీఎస్‌ను లెక్కించి, మిగిలిన పన్ను బాకీని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. క్రికెటర్ల ఆదాయంలో ముఖ్యంగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లేదా బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీ వంటి వాటి నుంచి వచ్చే నగదుపై 30% టీడీఎస్ కట్ చేస్తారు. ఈ బహుమతి మొత్తానికి మాత్రం జీఎస్టీ వర్తించదు. ఉదాహరణకు బీసీసీఐ ప్రకటించిన రూ.51 కోట్ల బహుమతిలో ఒక క్రీడాకారిణికి రూ.కోటి లభించింది అనుకుంటే, ఈ బహుమతిపై 30% టీడీఎస్ కట్ చేస్తారు. అంటే, రూ.70 లక్షలు ఆమె చేతికి అందుతుంది.


ఆ ప్లేయర్ మొత్తం వార్షిక ఆదాయం ఆధారంగా తుది ఆదాయపు పన్ను లెక్కించబడుతుంది. స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను లెక్కించిన తర్వాత ఇప్పటికే కట్ అయిన టీడీఎస్‌ను (రూ.30 లక్షలు) తీసివేసి, మిగిలిన మొత్తాన్ని ఐటీఆర్ దాఖలు సమయంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే, రూ.కోటి బహుమతి అందుకుంటే, ట్యాక్స్ రూపంలో ఆమె సుమారు రూ.27 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పన్ను చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి రూ.కోటి బహుమతి అందుకున్న వారికి చేతికి రూ.70 లక్షల కంటే తక్కువ వస్తుంది.

PolitEnt Main

PolitEnt Main

Next Story