Income Tax : ఐటీ రిఫండ్‌పై మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త!
అయితే జాగ్రత్త!

Income Tax : ఇటీవల చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక మెసేజ్ వస్తోంది. అసెస్‌మెంట్ ఇయర్ 2025-26 కోసం మీరు క్లెయిమ్ చేసిన రిఫండ్ ఇంకా ప్రాసెస్ కాలేదు అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. దీనికి కారణం మీరు ఫైల్ చేసిన రిటర్న్‌లో కొన్ని పొరపాట్లు ఉండడం వల్ల, రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ కింద మీ రిఫండ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఐటీ విభాగం తెలియజేస్తోంది. ఈ వివరాలను మీ రిజిస్టర్డ్ ఇమెయిల్‌కు కూడా పంపినట్లు తెలిపారు. అయితే ఇలాంటి మెసేజ్ వచ్చింది అంటే మీ రిఫండ్ ఆగిపోయిందని కాదు, ఆ లోపాలను సరిదిద్దుకుని రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం మీకు ఒక అవకాశం ఇస్తోందని అర్థం చేసుకోవాలి.
మీరు ఇంకా రివైజ్డ్ రిటర్న్‌ను ఫైల్ చేయకపోతే, డిసెంబర్ 31, 2025 లోపు ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు జనవరి 1, 2026 తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే, అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి రావొచ్చు. అందుకే ఐటీ విభాగం గుర్తించిన లోపాలను జాగ్రత్తగా పరిశీలించి, సమయానికి రివైజ్డ్ రిటర్న్‌ను సమర్పించడం అత్యంత సురక్షితమైన మార్గం. ఒకవేళ మీరు ఇప్పటికే రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసి ఉన్నప్పటికీ మీకు ఈ మెసేజ్ వస్తే, మీరు ఆ మెసేజ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తొందరపడి ఏ లింక్‌పైనా క్లిక్ చేయవద్దు. రిఫండ్‌ను సురక్షితంగా పొందడానికి ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ ను మాత్రమే ఉపయోగించండి.
ఇటీవల ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం సైబర్ ఫ్రాడ్ కేసుల గురించి ప్రజలను హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ పేరుతో ఇమెయిల్, ఎస్ఎంఎస్ , నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ స్కామ్‌లకు లక్ష్యంగా మారుతున్నారు. ట్యాక్స్ రిఫండ్, పెనాల్టీ లేదా కేవైసీ అప్‌డేట్ వంటి సాకులు చెప్పి ఇలాంటి నకిలీ మెసేజ్‌లు పంపుతుంటారు. తొందరపాటులో లింక్‌లు లేదా అటాచ్‌మెంట్‌లను తెరవడం ద్వారా, వినియోగదారుల వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు స్కామర్లకు చేరి, వారి ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తస్కరించబడుతోంది.
సైబర్ మోసాల నుంచి రక్షించుకోవడానికి ఈ క్రింది విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.
అధికారిక వెబ్‌సైట్ మాత్రమే: ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించిన ఏ పని అయినా కేవలం www.incometax.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేయాలి.
లింక్ చెకింగ్: ఏదైనా ఇమెయిల్, ఎస్ఎంఎస్ లేదా వెబ్‌సైట్‌పై క్లిక్ చేసే ముందు, ఆ డొమైన్ పేరు, లింక్‌ను జాగ్రత్తగా తనిఖీ చేయండి.
ప్రైవసీ సమాచారం అడగరు: ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఎప్పుడూ కూడా ఇమెయిల్ లేదా కాల్ ద్వారా ఓటీపీ, పాస్‌వర్డ్ లేదా బ్యాంక్ వివరాలు వంటి గోప్యమైన సమాచారాన్ని అడగదు.
అలాంటి మెసేజ్ వస్తే వెంటనే దాన్ని పట్టించుకోకుండా, సంబంధిత అధికారులకు తెలియజేయండి. క్లిక్ చేసే ముందు Think Twice, Act Wise (రెండుసార్లు ఆలోచించండి, తెలివిగా వ్యవహరించండి) అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి. మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా వృద్ధులకు ఈ సమాచారాన్ని తెలియజేయండి.

