వివరణ కోరిన కర్ణాటక ప్రభుత్వం

TCS : దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, దాదాపు 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కర్ణాటక కార్మిక శాఖ తీవ్రంగా స్పందించింది. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ మీడియాతో మాట్లాడుతూ.. టీసీఎస్ లో జరుగుతున్న లేఆఫ్స్ గురించి వివరాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కంపెనీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి టీసీఎస్ అధికారులను తమ ఆఫీసుకు రావాలని సూచించినట్లు మంత్రి తెలిపారు.

సాధారణంగా సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటే కొత్తగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొన్ని కార్మిక చట్టాల నుంచి మినహాయింపు ఉంటుంది. గత ఐదు సంవత్సరాలుగా ఈ మినహాయింపులు ఇస్తూనే ఉన్నామని మంత్రి సంతోష్ లాడ్ వివరించారు. అయితే, ఒక కంపెనీ ఎవరినైనా ఉద్యోగం నుంచి తొలగించాలనుకుంటే, ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ విషయంలో తాము టీసీఎస్ తో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు.

అందిన సమాచారం ప్రకారం, టీసీఎస్ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 2శాతం మందిని అంటే, దాదాపు 12,261 మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈ లేఆఫ్స్ ఎక్కువగా మిడ్-కెరీర్, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతాయి. ఈ తొలగింపుల వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని కంపెనీ గతంలోనే చెప్పింది. భవిష్యత్తు కోసం సిద్ధం కావడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అమలు చేయడానికి, టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడానికి, మార్కెట్‌ను విస్తరించడానికి, సంస్థాగతంగా కొన్ని మార్పులు చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. జూన్ 30, 2025 నాటికి, టీసీఎస్ లో మొత్తం 6,13,069 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే, ఒక వైపు లేఆఫ్స్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ 5,000 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవడం గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story