మరో పక్క బంపర్ లాభాలు ప్రకటించిన టీసీఎస్

TCS Q2 Results : భారతీయ ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన రెండో త్రైమాసికం ఫలితాలను గురువారం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ బంపర్ లాభాలను ఆర్జించింది. పన్నుల తర్వాత కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 1.4 శాతం పెరిగి రూ. 12,075 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 11,909 కోట్లుగా ఉంది. అయితే, ఓ సర్వే అంచనా వేసిన రూ. 12,528.3 కోట్ల లాభం కంటే ఇది కాస్త తక్కువగానే ఉంది. లాభాలు ఆర్జించడంతో పాటు, టీసీఎస్ తన పెట్టుబడిదారులకు దీపావళికి ముందే ఒక గొప్ప కానుకను కూడా ప్రకటించింది.

టీసీఎస్ ఈ త్రైమాసికంలో నమోదు చేసిన ఆర్థిక వివరాల్లోకి వెళితే.. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 65,799 కోట్లుగా నమోదైంది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 3.7% , స్థిర కరెన్సీ పరంగా 0.8% ఎక్కువ. కంపెనీ నివేదించిన నికర లాభం రూ. 12,904 కోట్లు. ఆపరేటింగ్ మార్జిన్ 0.7% పెరిగి 25.2%కి చేరుకుంది. నికర మార్జిన్ పెరిగి 19.6%కి చేరింది. కార్యకలాపాల నుండి వచ్చే క్యాష్ ఫ్లో నికర లాభంలో 110% గా ఉంది. ఇది కంపెనీ బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తోంది.

టీసీఎస్ భవిష్యత్తు కోసం తన వ్యూహాలను కూడా ప్రకటించింది. కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద AI-ఆధారిత టెక్నాలజీ సర్వీస్ కంపెనీగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అనేక పెద్ద పెట్టుబడులను ప్రకటించింది. భారతదేశంలో 1 గిగావాట్ సామర్థ్యం గల AI డేటాసెంటర్‌ను నిర్మించడానికి ఒక కొత్త బిజినెస్ యూనిట్‌ను ప్రారంభించింది. సేల్స్‌ఫోర్స్ కేంద్రీకృత కంపెనీ అయిన లిస్ట్ఎంగేజ్ ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

టాటా గ్రూప్‌కు చెందిన ఈ దిగ్గజ కంపెనీ లాభాలు సంపాదించడంతో పాటు, తన పెట్టుబడిదారులకు దీపావళి పండుగకు ముందు డివిడెండ్ రూపంలో కానుక అందించింది. కంపెనీ ఒక్కో షేరుకు రూ. 11 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌ను మంగళవారం, నవంబర్ 4, 2025 న చెల్లించడం జరుగుతుంది. డివిడెండ్‌కు అర్హత పొందేందుకు రికార్డ్ డేట్‌గా అక్టోబర్ 15, 2025ను నిర్ణయించారు

PolitEnt Media

PolitEnt Media

Next Story