TCS : గ్రాట్యుటీ నిరాకరించిన టీసీఎస్.. నేరుగా లేబర్ కోర్టుకు వెళ్లిన ఉద్యోగి.. కంపెనీకి గట్టి షాక్!
నేరుగా లేబర్ కోర్టుకు వెళ్లిన ఉద్యోగి.. కంపెనీకి గట్టి షాక్!

TCS : సాధారణంగా ఉద్యోగులను తొలగించడం లేదా రాజీనామా చేయించడం వంటి కారణాలతో వార్తల్లో నిలిచే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఈసారి లేబర్ కోర్టు చర్య కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ముంబైకి చెందిన ఒక ఉద్యోగికి సెలవులు ఇవ్వకుండా బలవంతంగా రాజీనామా చేయించి చివరికి గ్రాట్యుటీ కూడా నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే ఆ ఉద్యోగి ధైర్యంగా లేబర్ ఆఫీస్‌ను ఆశ్రయించడంతో, కంపెనీకి గట్టి గుణపాఠం, ఉద్యోగికి న్యాయం దక్కాయి.
ముంబైకి చెందిన ఆ ఉద్యోగి టీసీఎస్ లో ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న తన తండ్రిని చూసుకునేందుకు అతను ఎమర్జెన్సీ లీవ్ తీసుకున్నాడు. అయితే కంపెనీ సెలవు ఇవ్వకపోగా ఆ ఉద్యోగిపై రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకొచ్చింది. కంపెనీ వేధింపులు తట్టుకోలేక, చివరికి అతను తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత, కంపెనీ అతనికి గ్రాట్యుటీ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆ ఉద్యోగి నేరుగా లేబర్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేశాడు.
ఈ విషయంపై ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ ట్వీట్ చేస్తూ "లీవ్ బ్యాలెన్స్ పుష్కలంగా ఉన్నప్పటికీ, టీసీఎస్ ఆ ఉద్యోగిని రాజీనామా చేయమని బలవంతం చేసింది. అంతేకాకుండా గ్రాట్యుటీని కూడా ఇవ్వలేదు" అని తెలిపింది. ఫిర్యాదు అందిన వెంటనే ముంబై లేబర్ ఆఫీస్ టీసీఎస్ మేనేజ్‌మెంట్‌ను పిలిపించింది. లేబర్ కమిషనర్ కంపెనీకి తప్పుడు కార్మిక పద్ధతుల గురించి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఏడేళ్ల సర్వీస్‌కు సంబంధించిన పూర్తి గ్రాట్యుటీ మొత్తాన్ని ఉద్యోగికి చెల్లించాలని టీసీఎస్‌ను ఆదేశించారు. లేబర్ ఆఫీస్ ఆదేశాల మేరకు, ఆ ఉద్యోగికి చివరకు అతని పూర్తి గ్రాట్యుటీ మొత్తం లభించింది.
ఈ కేసు ద్వారా FITE ఒక ముఖ్యమైన పాఠాన్ని తెలియజేసింది. ఉద్యోగాల నుంచి తొలగించడం, బలవంతంగా రాజీనామా చేయించడం, అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసివేయడం లేదా చెల్లించాల్సిన బకాయిలను నిలిపివేయడం వంటి ఏ సమస్యలపైనైనా కంపెనీ ఇంటర్నల్ పాలసీలను ప్రశ్నించే, సవాలు చేసే పూర్తి అధికారం లేబర్ ఆఫీస్ / లేబర్ మంత్రిత్వ శాఖకు ఉంది. ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు ఎదురైతే తప్పకుండా ఫిర్యాదు చేయాలని FITE సూచించింది.

