Fixed Deposits : మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద ట్యాక్స్ కట్ అవుతోందా.. ఇలా చేస్తే తప్పించుకోవచ్చు
ఇలా చేస్తే తప్పించుకోవచ్చు

Fixed Deposits : ఫిక్స్‌డ్ డిపాజిట్లు భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే పెట్టుబడి పథకాల్లో ఒకటి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు తమ పొదుపును ఎఫ్‌డీలలోనే ఉంచుతారు. ఇప్పటికీ, సిప్ యుగంలో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది ఒక సంప్రదాయ పెట్టుబడి సాధనంగా కొనసాగుతోంది. అయితే, చాలా మందికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పన్ను ఉంటుందని తెలియదు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల అసలు మొత్తంపై పన్ను ఉండదు. కానీ, ఎఫ్‌డీల నుండి వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను విధిస్తారు. టీడీఎస్ నేరుగా కట్ అవుతుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి వచ్చే వార్షిక వడ్డీ ఆదాయం రూ. 50,000 దాటితే, బ్యాంకులు 10శాతం టీడీఎస్ కట్ చేయాలి అనేది బ్యాంకులకు ఉన్న నిబంధన. మీరు సీనియర్ సిటిజన్ అయితే, మీ వడ్డీ ఆదాయం రూ. 1,00,000 దాటితే టీడీఎస్ కట్ అవుతుంది.
ఉదాహరణకు, మీరు వార్షికంగా 7.5% వడ్డీ చెల్లించే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో సుమారు రూ. 6.67 లక్షల (సాధారణ పౌరులకు) లేదా రూ. 13.33 లక్షల (సీనియర్ సిటిజన్లకు) కంటే ఎక్కువ డబ్బును పెడితే, మీ వడ్డీ ఆదాయం ఆయా పరిమితులను దాటుతుంది. అప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. వడ్డీ ఆదాయం పరిమితిని దాటినప్పుడు, ఆ అదనపు మొత్తంపై మాత్రమే టీడీఎస్ కట్ అవుతుంది. పరిమితి మొత్తానికి టీడీఎస్ వర్తించదు అని గమనించాలి. ఒకవేళ మీ పాన్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింక్ చేయకపోతే, 20శాతం టీడీఎస్ కట్ అవుతుంది
మీ మొత్తం ఆదాయం కలిపినా కూడా ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంటే.. బ్యాంక్ టీడీఎస్ కట్ చేసినా దానిని నివారించవచ్చు. దాని కోసం, మీరు ఫారం 15G సమర్పించాలి. ఇది మీ మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి రాదని ప్రకటించే ఫారం. ఇది సమర్పిస్తే, మీ ఎఫ్ డీ వడ్డీ ఆదాయంపై బ్యాంక్ పన్ను కట్ చేయదు. మీరు సీనియర్ సిటిజన్ అయితే మీరు ఫారం 15H సమర్పించాలి. ఈ ఫారమ్‌లు ప్రతీ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సమర్పించడం మంచిది, అప్పుడే టీడీఎస్ కట్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు, ఎఫ్ డీ వడ్డీ ఆదాయాన్ని 'ఇతర వనరుల నుండి ఆదాయం' కింద చూపించాలి. ఒకవేళ మీ ఎఫ్ డీ పై టీడీఎస్ కట్ అయితే, మీరు ఐటీఆర్ ద్వారా ఆ మొత్తాన్ని వాపసు కోరవచ్చు.
