5 ఏళ్లలో 10 రెట్లు పెరిగిన టెక్ ఉద్యోగి జీతం.. వైరల్ అవుతున్న పోస్ట్!

Viral : ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సరైన నైపుణ్యం, అంకితభావం ఉంటే కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక టెక్ ప్రొఫెషన్ చేసిన పోస్ట్ ఒక ఉదాహరణగా నిలిచింది. ఐదు సంవత్సరాల క్రితం కేవలం రూ.18,000 నెల జీతంతో కెరీర్‌ను ప్రారంభించిన ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇప్పుడు తన జీతం రూ.1.8 లక్షలకు పెరిగిందని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ 10 రెట్ల జీతం పెరుగుదల టెక్ నిపుణుల సబ్‌రెడిట్‌లో వైరల్‌గా మారింది. కష్టపడి పనిచేస్తే ఫలితం దక్కుతుందని నిరూపించిన అతని ప్రయాణం, ఎంతోమంది యంగ్ ప్రొఫెషనల్స్‎కు స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఒక టెక్ ఉద్యోగి r/developersIndia సబ్‌రెడిట్‌లో తన వ్యక్తిగత వృత్తిపరమైన విజయాన్ని పంచుకోవడంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో తన జీతం పది రెట్లు పెరిగిందని ఆయన వివరించారు. ఐదేళ్ల క్రితం ఒక చిన్న స్టార్టప్‌లో నెలకు కేవలం రూ.18,000 జీతంతో తన కెరీర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆ సమయంలో నిరంతరంగా ఎక్కువ పనిగంటలు పనిచేయడం, తప్పులు చేయడం, చాలా నేర్చుకోవడం వంటి సవాళ్లు ఎదురయ్యాయని వివరించారు.

అన్ని సవాళ్లను, కష్టమైన ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించి, కష్టపడి పనిచేసినందుకు ప్రతిఫలంగా, తనకు ఇప్పుడు రూ.1.8 లక్షల నెల జీతం ఆఫర్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో 10 రెట్లు జీతం పెరుగుదల సాధించినందుకు తనకు గర్వంగా ఉందని తెలిపారు. ఆ టెక్ నిపుణుడి వృద్ధి కథనంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. అనేక మంది ఇతర వినియోగదారులు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. ఒక యూజర్ "చాలా అద్భుతంగా ఉంది. మీ భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు" అని కామెంట్ చేశారు.

మరో యూజర్, ఉద్యోగం చేస్తూనే తన నైపుణ్యాలను ఎలా పెంచుకున్నారు. పని, ప్రాక్టీస్ ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు. దేనిపై ఎక్కువగా దృష్టి పెట్టారు అనే వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపారు. మరొక యూజర్ కూడా దాదాపు ఇలాంటి అనుభవాన్నే పంచుకున్నారు. ఆయన ఇంటర్న్‌గా నెలకు రూ.13,000 సంపాదించేవారని, ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ట్యాక్సులు పోగా దాదాపు రూ.1,80,000 వస్తుందని తెలిపారు. తమ ప్రయాణం ఒడిదొడుకులతో ఒత్తిడితో కూడుకున్నదని అంగీకరించారు. ఈ టెక్ నిపుణుడి పోస్ట్, తమ కెరీర్‌లో కష్టపడుతున్న, నేర్చుకుంటున్న యువ నిపుణులకు స్ఫూర్తిని ఇచ్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story