Thalapathy Vijay : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ఇప్పుడు తన హామీల అమలుపై దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ తరహా వాగ్దానాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా మహిళలు, రైతులు, నిరుద్యోగులను ఆకట్టుకునేలా ఉన్న ఈ పథకాలను అమలు చేయాలంటే తమిళనాడు ఖజానాపై భారీ భారం పడనుందని ఆర్థిక విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.

మహిళలు, రైతులకు వరాల జల్లు

విజయ్ తన మేనిఫెస్టోలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) కింద ప్రతి నెలా మహిళలకు రూ.2,500 ఇస్తామని ప్రకటించారు. దీని ద్వారా దాదాపు 1.57 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఈ ఒక్క పథకానికే ఏటా రూ.47,100 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అలాగే రైతులకు భరోసా కల్పిస్తూ ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. దీనివల్ల 79 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది, ఇందుకు మరో రూ.11,910 కోట్లు అవసరమవుతాయి.

ఫ్రీ సిలిండర్లు, విద్యా కానుక

మధ్యతరగతి ఇళ్లను ఆకట్టుకోవడానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని టీవీకే హామీ ఇచ్చింది. దీనివల్ల దాదాపు రూ.9,990 కోట్ల అదనపు భారం పడనుంది. విద్యారంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తెస్తామన్న విజయ్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఏడాదికి రూ.15,000 ఇస్తామని చెప్పారు. దీనివల్ల 56 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది, ఇందుకు రూ.8,438 కోట్లు ఖర్చవుతుంది.

నిరుద్యోగ భృతి, యువతకు స్టైఫండ్

యువతను ఆకర్షించేలా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.4,000 ఇస్తామని, తద్వారా 10 లక్షల మంది యువతకు ఉపాధి దొరికే వరకు ఆసరాగా ఉంటామని చెప్పారు. ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్లు చేస్తున్న వారికి ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు స్టైఫండ్ ఇస్తామన్నారు. ఈ యువజన పథకాలకు ఏటా రూ.5,400 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది.

ఆదాయం వర్సెస్ వ్యయం

తమిళనాడు ప్రస్తుత ఆదాయం సుమారు రూ.3.31 లక్షల కోట్లు. అయితే విజయ్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే సంక్షేమ వ్యయం రూ.99,057 కోట్లకు చేరుతుంది. అంటే రాష్ట్ర మొత్తం ఆదాయంలో దాదాపు 30 శాతం కేవలం ఈ పథకాలకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం సంక్షేమం కోసం దాదాపు 20 శాతం నిధులు ఖర్చు చేస్తోంది. విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ఖర్చు 52 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదనపు ఆదాయ వనరులను పెంచుకోకపోతే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వారు విశ్లేషిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story