ట్రంప్‌కు టెన్షన్ పెంచుతున్న రిపోర్టు

Dollor : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఒక కొత్త నివేదిక ప్రకారం.. అమెరికా డాలర్ ఆధిపత్యం గతంలో మాదిరిగా లేదని తేలింది. చాలా దేశాలు డాలర్‌కు దూరంగా ఉండి, యూరో, యువాన్, క్రిప్టోకరెన్సీల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త కెన్నెత్ రోగోఫ్ చేసిన ఈ హెచ్చరిక డొనాల్డ్ ట్రంప్‌కు ఆందోళన కలిగించవచ్చు. ఎందుకంటే డాలర్ బలాన్ని అమెరికా అతిపెద్ద ఆయుధంగా ట్రంప్ భావిస్తారు. రోగోఫ్ తన నివేదికలో ప్రపంచం నెమ్మదిగా డాలర్ నుంచి దూరం అవుతుందని, ఇతర కరెన్సీలపై నమ్మకం పెరుగుతుందని స్పష్టం చేశారు.

యూరో, యువాన్, క్రిప్టోలకు పెరుగుతున్న ఆదరణ

ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం..ప్రజలు ఇకపై డాలర్‌పై మాత్రమే ఆధారపడాలని అనుకోవడం లేదు. ఇప్పుడు యూరో, చైనా కరెన్సీ యువాన్ (రెన్‌మిన్‌బి), క్రిప్టోకరెన్సీ వంటి డిజిటల్ కరెన్సీలపై కూడా ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది. డాలర్ ఇప్పటికీ ఉంటుందని, కానీ ఇప్పుడు దానికి పోటీగా కొత్త కరెన్సీలు నిలబడుతున్నాయని ఆయన చెప్పారు. రోగోఫ్ అంచనా ప్రకారం.. ఈ మార్పులు నెమ్మదిగా అమెరికా బలాన్ని కూడా బలహీనపరుస్తాయి. ఇకపై అమెరికా ఏ దేశం మీదనైనా ఆర్థిక ఆంక్షలు విధించాలనుకుంటే, అది గతంలో అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు.

అమెరికాకు షాక్ తప్పదా?

ఎక్కువ దేశాలు డాలర్ నుంచి దూరం అయితే, దాని ప్రభావం నేరుగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతుందని రోగోఫ్ హెచ్చరించారు. దీనివల్ల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు అప్పు తీసుకోవడం, తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. చాలా దేశాలు ఇప్పుడు అమెరికా డాలర్ నిల్వలను (విదేశీ నిల్వలు) తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నాయని ఆయన చెప్పారు. అమెరికన్ ట్రెజరీ బిల్లులలో పెట్టుబడులను కూడా వారు తగ్గించుకోవచ్చు. దీనివల్ల బయటి నుంచి డబ్బు సేకరించడం అమెరికాకు ఖరీదైన వ్యవహారం అవుతుంది.

ఇప్పటికే భారీ అప్పుల్లో అమెరికా

అమెరికా ఇప్పటికే భారీ అప్పుల్లో ఉందని రోగోఫ్ చెప్పారు. పైగా వడ్డీ రేట్లు పెరిగితే సమస్యలు మరింత పెరుగుతాయని అన్నారు. భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై 50% పన్ను (టారిఫ్) విధించాలనే డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికను కూడా ఆయన విమర్శించారు. ఈ చర్య అమెరికాకు హానికరం కావచ్చని రోగోఫ్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం పెద్దగా సంక్షోభం లేదని, కానీ ప్రమాదాలు మాత్రం పెరుగుతున్నాయని చెప్పారు. అప్పులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, రాజకీయ అస్థిరత ఉన్నప్పుడు, మరియు హఠాత్తుగా పెద్ద షాక్ తగిలినప్పుడే అసలు సంక్షోభం వస్తుందని రోగోఫ్ తెలిపారు.

భారత్‌కు ప్రయోజనం దక్కే అవకాశం

ఈ వార్త అమెరికాకు చెడ్డదే అయినా, భారత్ లాంటి దేశాలకు ఇది మంచిది. ఒకవేళ డాలర్ బలహీనపడితే, యువాన్ లేదా యూరో వంటి కరెన్సీలు బలపడతాయి. అప్పుడు ప్రపంచ ఆర్థిక చిత్రం మారిపోతుంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇందులో మంచి అవకాశాలు ఉండవచ్చు. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దారుణమైన స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ రూ. 87.31గా ఉంది. భవిష్యత్తులో రోగోఫ్ మాటలు నిజమైతే, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మెరుగుపడవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story