Russian Vodka : ప్రపంచం దీనికి ఎందుకు పడిచచ్చిపోతోంది? భారత్‌లో ధరలు విని షాక్ అవుతారు
భారత్‌లో ధరలు విని షాక్ అవుతారు

Russian Vodka : వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల భారతదేశంలో పర్యటించిన తర్వాత, రష్యన్ సంస్కృతి పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో రష్యన్ సంస్కృతిలో అంతర్భాగమైన రష్యన్ వోడ్కా ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రష్యా ప్రజలకు వోడ్కా అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. ఇది వారి చరిత్ర, సంస్కృతి, సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. రష్యన్ భాషలో వోడ్కా అనే పదం వోదా అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం నీరు. ఈ పేరును బట్టే రష్యా ప్రజల జీవితంలో దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. పుట్టినప్పటి నుంచి మరణం వరకు అంటే పెళ్లి వేడుకలు, అంత్యక్రియలతో సహా అన్ని సామాజిక కార్యక్రమాలలో వోడ్కా తప్పనిసరిగా ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే వోడ్కా 1430 సంవత్సరంలో మాస్కోలోని ఒక మఠంలో మొదట తయారు చేయబడిందని రష్యన్లు నమ్ముతారు. ఆశ్చర్యకరంగా మొదట్లో దీనిని కేవలం యాంటీ-బాక్టీరియల్ గుణాల కోసం ఔషధంగా ఉపయోగించేవారు. కాలక్రమేణా ఇది రష్యా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో కూడా ముఖ్యమైన భాగమైంది.
వోడ్కాను మిగతా ఆల్కహాల్ పానీయాల నుంచి దాని స్వచ్ఛత, కిక్ వేరు చేస్తాయి. దీని తయారీకి ప్రధానంగా పిండి పదార్థాలు (స్టార్చ్), చక్కెర ఎక్కువగా ఉండే బంగాళాదుంపలు, గోధుమలు, రై లేదా షుగర్ బీట్ వంటి వాటిని ఉపయోగిస్తారు. ఈ ముడి పదార్థాలను ఉడికించి, కిణ్వ ప్రక్రియ కోసం ఉంచుతారు, దీని ద్వారా 3-4 రోజుల్లో ఆల్కహాల్ తయారవుతుంది. రష్యన్ వోడ్కా ప్రత్యేకత దాని డిస్టిలేషన్ పద్ధతిలో ఉంది. మలినాలను పూర్తిగా తొలగించడానికి దీనిని పదేపదే డిస్టిల్ చేస్తారు. కొన్ని ప్రీమియం బ్రాండ్లు దీనిని చార్‌కోల్ ఫిల్ట్రేషన్ ద్వారా శుద్ధి చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల దీని రుచి చాలా శుభ్రంగా, మృదువుగా ఉంటుంది. చివరగా, ఆల్కహాల్ లెవల్ బ్యాలెన్స్ చేయడానికి ప్రత్యేక రకమైన నీటిని కలుపుతారు. భారతదేశంలో మద్యం ప్రియులు దీని స్మూత్‌నెస్ కారణంగా కాక్‌టెయిల్స్‌లో లేదా నేరుగా నీట్ గా తాగడానికి దీనిని ఇష్టపడతారు.
భారతదేశంలోని మద్యం ప్రియుల మధ్య రష్యన్ వోడ్కాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని రష్యన్ వోడ్కా బ్రాండ్లు, వాటి ప్రత్యేకతలు, భారతదేశంలో అంచనా ధరల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. స్టోలిచ్‌నాయా అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్‌గా పరిగణించబడుతుంది. దీనిని గోధుమ, రైతో నాలుగు సార్లు డిస్టిల్ చేస్తారు. దీని 750 ఎంఎల్ బాటిల్ ధర సుమారు రూ.1,500 ఉంటుంది. ఇక బెలుగా నోబుల్ మరింత ప్రీమియం బ్రాండ్. సైబీరియాలో తయారయ్యే ఈ వోడ్కాకు ఉత్పత్తి తర్వాత 30 రోజులు రెస్ట్ ఇస్తారు. దీని ధర దాదాపు రూ.5,990 వరకు ఉంటుంది.
రష్యన్ స్టాండర్డ్ బ్రాండ్ భారతదేశంలో చాలా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. దీని ఒరిజినల్ వేరియంట్ సుమారు రూ.2,200 ధర కలిగి ఉండగా, గోల్డ్ (రూ.2,600), ప్లాటినం (రూ.5,000) వంటి వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరో ఆసక్తికరమైన బ్రాండ్ AMG కార్బన్ , ఇది ప్రత్యేకమైన కార్బన్ ఫిల్టరేషన్ ప్రక్రియతో తయారవుతుంది. సుమారు రూ.2,000 ధరతో లభిస్తుంది. చివరిగా, గ్రీన్ మార్క్ అనేది సాంప్రదాయ రష్యన్ రెసిపీ ఆధారంగా సరసమైన ధరలో మంచి క్వాలిటీని అందిస్తుంది. దీని అంచనా ధర సుమారు రూ.1,630గా ఉంది. (ఈ ధరలన్నీ 750 ML బాటిళ్లకు సంబంధించినవి. రాష్ట్రాల వారీగా పన్నులు, లభ్యత ఆధారంగా కొద్దిగా మారవచ్చు).

