ఇన్సూరెన్స్ క్లెయిమ్ సులువుగా రావాలంటే చేయాల్సిన పనులు ఇవే!

Car Insurance : వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరిగే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఇక్కడ ప్రతిరోజూ 400-500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఎక్కువ ప్రమాదాల్లో కార్లు ఉంటున్నాయి. అయితే, ఖరీదైన కార్లు కొనే చాలామంది సరైన ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెనకాడుతుంటారు. పేరుకు మాత్రమే తక్కువ ప్రీమియం ఉన్న ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసుకుని సరిపెట్టుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో ఆసుపత్రిలో చేరినప్పుడు ఎలా తెలుస్తుందో, అలాగే వాహన ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో ప్రమాదం జరిగిన తర్వాత కానీ తెలియదు. కారు ప్రమాదం జరిగినప్పుడు, మొదటగా చేయాల్సింది కారులో ఉన్నవారి భద్రత గురించి చూసుకోవాలి. ఎవరికైనా గాయాలైతే, ముందుగా వారికి చికిత్స అందేలా చూడాలి.

ఇది పూర్తయిన తర్వాత, చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే, ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రమాదం గురించి తెలియజేయడం. ప్రమాదం జరిగిన 24 గంటలలోపు ఈ పనిని తప్పకుండా చేయాలి. ఇలా చేస్తే, క్లెయిమ్ చేసుకోవడానికి మార్గం సులభం అవుతుంది. మీరు ఆలస్యంగా సమాచారం ఇస్తే మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు, ముఖ్యంగా థర్డ్ పార్టీ డ్యామేజ్ (అంటే, మీ కారు ప్రమాదంలో వేరే వ్యక్తులకు గాయాలైనప్పుడు లేదా మరణం సంభవించినప్పుడు) అయినప్పుడు, దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ ద్వారా కేసు నమోదు చేయాలి.

చాలా ప్రమాద కేసుల్లో, ఇన్సూరెన్స్ కంపెనీలు పోలీస్ ఎఫ్‌ఐఆర్ కాపీని అడుగుతాయి. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, ఎఫ్‌ఐఆర్, డ్రైవింగ్ లైసెన్స్, పాలసీ కాపీ, ఆర్‌సి వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. అప్పుడు క్లెయిమ్‌కు ఈజీగా ఆమోదం లభిస్తుంది. వాహన ఇన్సూరెన్స్ విషయంలో చాలామంది పేరుకు మాత్రమే ఏదో ఒక పాలసీని కొంటారు. కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవడం కంటే, కనీస థర్డ్ పార్టీ ప్లాన్‌లను తీసుకునేవారే ఎక్కువ మంది ఉన్నారు. ఇది తప్పు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో మీ వాహనం వల్ల ఇతరులకు నష్టం జరిగితే మాత్రమే వారికి నష్టపరిహారం లభిస్తుంది. మీ వాహనానికి జరిగిన నష్టానికి కవరేజ్ ఉండదు. కాంప్రహెన్సివ్ పాలసీలో మీకు, థర్డ్ పార్టీ ఇద్దరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మీ వాహనానికి నష్టం జరిగితే కూడా నిర్ణీత మొత్తం పరిహారం లభిస్తుంది. మీరు పాలసీని తీసుకునేటప్పుడు అందులో ఏ ఏ అంశాలు కవర్ అయ్యాయో స్పష్టంగా వివరించి ఉంటుంది. మీరు ఎంత డబ్బుకు క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story