ఈ ఒక్క అలవాటు మీ జీవితాన్ని నాశనం చేస్తుంది

Credit Card : నేటి టెక్ యుగంలో క్రెడిట్ కార్డు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ఇది సౌకర్యాన్ని, భద్రతను ఇస్తుంది. అత్యవసర సమయాల్లో డబ్బు సమస్య లేకుండా చూస్తుంది. కానీ ఈ సౌకర్యమే మిమ్మల్ని ఒక పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.దీనికి కారణం క్రెడిట్ కార్డు బిల్లులో కనిపించే చిన్న ఆప్షన్ - అదే మినిమం పేమెంట్ డ్యూ. ఈ ఆప్షన్ పేరు వినడానికి ఎంత సులువుగా ఉంటుందో, దాని ప్రభావం అంత భయంకరంగా ఉంటుంది.

నెల చివర్లో క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు మొత్తం కట్టడానికి జేబులో డబ్బు లేకపోతే బిల్లులో కనిపించే ఆ చిన్న మొత్తం (మినిమం పేమెంట్) మన కళ్లకు ఊరట కలిగిస్తుంది. కంపెనీలు మొత్తం బిల్లులో ఒక చిన్న భాగాన్ని (సాధారణంగా 5% నుంచి 15% వరకు) మాత్రమే చెల్లించే అవకాశం ఇస్తాయి. ఈ చిన్న మొత్తం కడితే లేట్ ఫీజు పడకుండా ఉంటుందని, అకౌంట్ యాక్టివ్‌గా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఇది తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా అసలు ప్రమాదం ఇక్కడి నుంచే మొదలవుతుంది.

మినిమం పేమెంట్ చేయడం అనేది తాత్కాలిక ఉపశమనం ఇచ్చే ఉచ్చు లాంటిది. ఎందుకంటే, మీరు మొత్తం బిల్లు కట్టకుండా కేవలం కనీస మొత్తమే చెల్లించిన వెంటనే మీ బకాయి ఉన్న మొత్తంపై భారీ వడ్డీ పడటం మొదలవుతుంది. ఈ వడ్డీ రేటు సంవత్సరానికి 36% నుంచి 40% వరకు ఉండవచ్చు. ఉదాహరణకు మీరు క్రెడిట్ కార్డు ద్వారా కేవలం రూ.100 ఖర్చు చేసి, దాన్ని సకాలంలో కట్టకపోతే ఒక సంవత్సరంలో మీరు రూ.36 నుంచి రూ.40 వరకు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అందుకే దీన్ని దివాలా తీయించే వడ్డీ అని పిలవడంలో అతిశయోక్తి లేదు.

మినిమం పేమెంట్ లో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, మీరు చెల్లించే మొత్తంలో ఎక్కువ భాగం వడ్డీ కట్టడానికే పోతుంది. మీరు తీసుకున్న అసలు అప్పు మాత్రం అలాగే ఉండిపోతుంది, లేదా చాలా నెమ్మదిగా తగ్గుతుంది. సంవత్సరాల తరబడి మీరు ప్రతి నెలా మినిమం పేమెంట్ చేస్తూనే ఉంటారు. మీరు అప్పు తీరుస్తున్నారని అనుకుంటారు కానీ, వాస్తవానికి మీరు చక్రవడ్డీ భారాన్ని మాత్రమే భరిస్తుంటారు. దీనివల్ల మీ అప్పు చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. చివరికి మీరు తీసుకున్న అసలు మొత్తం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కేవలం వడ్డీ రూపంలోనే బ్యాంకుకు చెల్లించి ఉంటారు. ఇది అప్పుల ఊబి లాంటిది.

వడ్డీ భారం మాత్రమే కాదు, మినిమం పేమెంట్ చేయడం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తుపై మరో తీవ్ర ప్రభావం పడుతుంది. మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. మీరు బకాయి ఉన్న మొత్తంలో ఎక్కువ భాగం చెల్లించకపోతే మీ క్రెడిట్ కార్డు వినియోగ నిష్పత్తి పెరుగుతుంది. ఈ నిష్పత్తిని 30% కంటే తక్కువగా ఉంచుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతారు. కానీ మినిమం పేమెంట్స్ మాటిమాటికి చేయడం వల్ల ఈ నిష్పత్తి పెరుగుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుంది. బలహీనమైన క్రెడిట్ స్కోర్ భవిష్యత్తులో లోన్ తీసుకోవడానికి లేదా ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి పెద్ద అడ్డంకిగా మారుతుంది.

ఈ ఆర్థిక ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే.. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని సకాలంలో పూర్తిగా చెల్లించడం. ఒకవేళ ఏదైనా నెలలో మొత్తం చెల్లించడం అసాధ్యం అయినా, కనీస మొత్తం కంటే ఎక్కువగా చెల్లించడానికి ప్రయత్నించండి. మీరు అసలు అప్పును తగ్గించడానికి ప్రయత్నించాలి తప్ప, కేవలం లేట్ ఫీజు పడకుండా చూసుకోవడం కాదు. క్రెడిట్ కార్డును అప్పుగా కాకుండా, ఒక సౌకర్యంగా మాత్రమే ఉపయోగించండి. సరైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారానే మీరు ఈ స్పీట్ పాయిజన్ లాంటి మినిమం పేమెంట్ ఉచ్చు నుంచి తప్పించుకోగలుగుతారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story