జీఎస్టీ 2.0తో ఏ వస్తువుల ధరలు ఎంత తగ్గుతాయంటే

GST 2.0 : బడ్జెట్‌లో ఆదాయపు పన్ను విషయంలో ఊరట కల్పించిన తర్వాత, ఇప్పుడు మోడీ ప్రభుత్వం జీఎస్టీపై కూడా సామాన్యులకు దీపావళి కానుక ఇచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న భారీ నిర్ణయం ప్రకారం.. జీఎస్టీలో ఉన్న 4 పన్నుల స్లాబ్‌లను 5%, 18% అనే 2 స్లాబ్‌లకు తగ్గించారు. గతంలో ఉన్న 5%, 12%, 18%, 28% పన్నులు ఇప్పుడు ఈ రెండు స్లాబ్‌ల కిందకి వస్తాయి. అలాగే, ఆరోగ్యానికి హానికరం అయిన, విలాసవంతమైన వస్తువులపై 40% ప్రత్యేక స్లాబ్‌ను కూడా ఉంచారు. ఈసారి ప్రభుత్వం సామాన్యులపై దృష్టి పెట్టింది. అందుకే నిత్యావసర వస్తువులపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించింది.

ఎంత ఆదా అవుతుందో తెలుసా?

మోడీ ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌లలో చేసిన ఈ మార్పు సామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక వస్తువు ధర రూ.100 అనుకుంటే, దానిపై 12% జీఎస్టీ పన్ను ఉంటే, ఆ వస్తువు గరిష్ట ధర రూ.112 అవుతుంది. సామాన్య ప్రజలు ఉపయోగించే చాలా వస్తువులు ఈ 12% జీఎస్టీ స్లాబ్‌లోనే ఉండేవి. కానీ, ఇప్పుడు జీఎస్టీ మార్పు తర్వాత అదే వస్తువు ధర రూ.105 అవుతుంది. అంటే, ఇంతకు ముందు రూ.112కి లభించే వస్తువు ఇప్పుడు రూ.105కే లభిస్తుంది. దీనివల్ల నేరుగా ప్రజల జేబులో రూ.7 ఆదా అవుతుంది.

ఈ వస్తువులపై 12%కి బదులు 5% పన్ను..

ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌లలో మార్పులు చేసిన తర్వాత, ఆహార పదార్థాలతో పాటు ఇతర నిత్యావసరాలపై కూడా పన్ను తగ్గింది. ఇందులో వెన్న, నమకీన్, నెయ్యి, భుజియా, చీజ్, పిల్లల డైపర్స్, వంట పాత్రలు, కుట్టుమిషన్, గ్లూకోమీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఇరిగేషన్ సిస్టమ్స్, టెస్ట్ స్ట్రిప్స్, బయో పెస్టిసైడ్స్, ట్రాక్టర్లు వంటి వ్యవసాయ పరికరాలు కూడా చవకగా లభిస్తాయి.

ఈ వస్తువులపై 18%కి బదులు 5% పన్ను..

కొత్త జీఎస్టీ స్లాబ్ ప్రకారం, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్, టాయిలెట్ క్లీనర్, థర్మామీటర్, ట్రాక్టర్ల టైర్లు, వాటి విడిభాగాలపై గతంలో 18% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు అది 5%కి తగ్గింది. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, యూలిప్లపై ఉన్న 18% పన్నును పూర్తిగా తొలగించారు.

జీరో పన్నుతో కొన్ని వస్తువులు..

ప్రభుత్వం ప్యాక్ చేసిన పన్నీర్ పై గతంలో ఉన్న 5% జీఎస్టీని పూర్తిగా సున్నాకి తగ్గించింది. ఇదే విధంగా రొట్టె, చపాతీ, ఖాఖ్రా, పిజ్జా బ్రెడ్లపై కూడా జీఎస్టీ తొలగించారు. బాదం, పిస్తా, ఖర్జూరం, చేపలు, బేకింగ్ పౌడర్, చక్కెర, డబ్బా కొబ్బరి, పండ్ల రసాలపై 5% జీఎస్టీ విధించారు. చాక్లెట్లు, పేస్ట్రీలు, కేకులు, బిస్కెట్లు, జామ్, రెడీమేడ్ సూప్, కార్న్ ఫ్లేక్స్పై పన్నును 18% నుంచి 5%కి తగ్గించారు.

ఈ వస్తువులు మాత్రం ఖరీదవుతాయి..

కొత్త జీఎస్టీ స్లాబ్‌లో, సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా, పొగాకు వంటి ఉత్పత్తులపై పన్నును 28% నుంచి 40%కి పెంచారు. వీటితో పాటు, కార్బొనేటెడ్, కెఫైన్ ఉన్న పానీయాలు, ఎస్‌యూవీలు, ఖరీదైన మోటార్ సైకిళ్లు, వ్యక్తిగత విమానాలపై కూడా పన్ను పెరిగింది. ఈ నిర్ణయం వల్ల పొగాకు లేదా సిగరెట్లు వాడే వారి నెలవారీ ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గినా, వారికి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story